కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శిబిరంగా మారిన హైదరాబాద్

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో దేశంలో ఆ పార్టీ ఏ రాష్ట్రంలో ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా వారు బలపరీక్ష ఎదుర్కోవలసి వస్తే తమ ఎమ్యెల్యేలను కాపాడుకునేందుకు శిబిరంగా హైదరాబాద్ నగరాన్ని మారుస్తున్నారు. 
 
గత వారం ఝార్ఖండ్ లో ముఖ్యమంత్రి మారడంతో, కొత్త ముఖ్యమంత్రి బలపరీక్ష జరుపుకొనే వరకు అధికార జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా 40 మందిని  హైదరాబాద్‌లో రిసార్ట్‌ రాజకీయం సాగించారు. బలపరీక్షలో పాల్గొనేందుకు ఆదివారం హైదరాబాద్‌ నుంచి రాంచీకి తిరుగు ప్రయాణమయ్యారమై,సోమవారం జరిగిన ఫ్లోర్‌ టెస్ట్‌లో పాల్గొని ప్రభుత్వం నెగ్గేటట్లు చేసుకున్నారు. 
 
తాజాగా, కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న కూటమి నుండి బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలోకి మారి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా బీహార్ లో బలపరీక్షకు దిగడంతో అక్కడి నుండి తమ ఎమ్యెల్యేలను హైదరాబాద్ కు తరలించారు.  నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం ఈ నెల 12న అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనున్నది. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం 16 మంది బీహార్‌ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమానంలో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అనంతరం బస్సులో నగర శివారులోని రిసార్ట్‌కు వారిని తరలించారు. మిగతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్‌ చేరుకుంటారని బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్ తెలిపారు.

కాగా, బీహార్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మనోహర్ ప్రసాద్ సింగ్, సిద్ధార్థ్ సౌరవ్ ఈ బృందంలో చేరలేదు. ప్రసాద్‌ సింగ్‌ తర్వాత చేరుతారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌తో విభేదాలున్న సిద్ధార్థ్ సౌరవ్‌, మరి కొందరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ బీహార్ ఇన్‌ఛార్జ్ మోహన్ ప్రకాష్, తమ ఎమ్మెల్యేల ఫిరాయింపు పుకార్లను తోసిపుచ్చారు.