తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ కుప్ప‌కూల‌డం ఖాయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని, అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు వైసిపి ఎంపి విజ‌య‌సాయిరెడ్డి. రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో సోమవారం జరిగిన చర్చలో ఆయ‌న మాట్లాడుతూ, ఏపీకి కాంగ్రెస్ విలన్ గా మారిందని, అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ పార్టీని ఏపీ ప్రజలు ఎప్పటికీ క్షమించరని చెబుతూ జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్‌ కనుమరుగవడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ ఉన్నంత కాలం దేశం వెనుకబాటుతో కుంగిపోయిందని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని అంటూ కుటుంబ విషయాల్లో కాంగ్రెస్‌ జోక్యం చేసుకొని నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నదని  చెబుతూ పరోక్షంగా షర్మిల వ్యవహారాన్ని ప్రస్తావించారు.
 
తెలంగాణ ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనం ఆశించినా నెరవేరలేదని, అయితే పదేళ్ల తరువాత అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. త్వరలోనే అక్కడి ప్రభుత్వం పడిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏపీలో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ధ్వజమెత్తారు.
 2029 లో కూడా తాను ఎంపీగా ఉంటాన‌ని, అప్పుడు కాంగ్రెస్ కు ఒక్క ఎంపీ కూడా ఉండబోరని స్పష్టం చేశారు.  2019లో రాహుల్‌ గాంధీ అమేధిలో ఓడిపోయారని గుర్తు చేశారు. 2024లో ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని చెబుతూ మిత్రపక్షాలే కాంగ్రెస్‌ను నమ్మడం లేదని, 2029 నాటికి కాంగ్రెస్‌ ముక్త భారత్‌ తథ్యమని జోస్యం చెప్పారు.

కుటుంబాలను చీల్చడం కాంగ్రెస్ కు అలవాటు అని మండిపడ్డారు. పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారని పేర్కొంటూ ఈ విషయాన్ని చరిత్ర మరువదని ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కంటితుడుపు హామీ ఇచ్చింద‌ని చెబుతూ ఏపీ కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.