శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డు

ప్రతిష్టాత్మక 66వ వార్షిక గ్రామీ అవార్డులు 2024లో భారత్‌ సత్తా చాటింది. భారతీయ సంగీత దిగ్గజాలు జాకీర్‌ హుస్సేన్‌, శంకర్‌ మహదేవన్‌ల ఫ్యూజన్‌ బ్యాండ్‌ ‘శక్తి’కి బెస్ట్‌ గ్లోబల్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డు దక్కింది. గ్రామీ అవార్డును అందుకునేందుకు శంకర్‌ మహదేవన్‌, జాకీర్‌ హుస్సేన్‌, బృందం సభ్యులు లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. 
 
అవార్డు గెలుచుకున్న సందర్భంగా బృంద సభ్యులు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు వారు విడుదల చేసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అవార్డు గెలుచుకున్న బృందంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.  శంకర్ మహదేవన్, జాకిర్ హుస్సేన్ స్వరపరచిన ‘దిస్ మూమెంట్’ అనే ఆల్బమ్ కు ఉత్తమ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు లభించింది.
 
భారత ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్‍కు మొత్తంగా మూడు గ్రామీ అవార్డులు దక్కాయి. పాస్తో అల్బమ్‍‍కు గాను ఆయనకు బెస్ట్ మ్యూజిక్ గ్లోబల్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. భారత పాపులర్ గాయకుడు శంకర్ మహదేవన్ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నారు. 
 
శంకర్ మహదేవన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఉన్న భారత్‍కు చెందిన ‘శక్తి’ మ్యూజికల్ బ్యాండ్‍కు బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. ఈ బ్యాండ్ రూపొందించిన ‘దిస్ మూవ్‍మెంట్’ అనే స్టూడియో ఆల్బమ్‍కు గ్రామీ పురస్కారం దక్కింది.  ఈ సందర్భంగా శంకర్ మహదేవన్ మాట్లాడుతూ ఈ ఆల్బమ్ రూపొందడం వెనుక ఎంతోమంది శ్రమించారని చెప్పారు. తనకు అన్ని విషయాల్లోనూ అండదండలు అందిస్తున్న తన భార్యకు  ఈ అవార్డును అంకితం చేస్తున్నానని ప్రకటించారు.

“మా పేరు ప్రకటించినప్పుడు ఓ క్షణం పాటు నేను గుర్తించలేకపోయా. మేం చాలా సంతోషించాం. ఆ ఫీలింగ్‍ను చెప్పడం చాలా కష్టం” అని మహదేవన్ చెప్పారు. 66వ గ్రామీ అవార్డుల వేదిక వద్ద కోలాహలం గురించి కూడా శంకర్ మహదేవన్ చెబుతూ “ఇదో అద్భుతమైన వేదిక. ప్రపంచం అత్యధికంగా మాట్లాడుకునే మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. అలాంటి వేదికపైకి ఎక్కడం, ఈ గొప్ప గౌరవాన్ని పొందడం మాటల్లో వివరించలేకున్నా” అని తెలిపారు.

కాగా, పాప్ సింగ‌ర్ టేల‌ర్ స్విఫ్ట్ గ్రామీ మ్యూజిక్ అవార్డుల్లో కొత్త చ‌రిత్ర‌ను లిఖించింది. బెస్ట్ ఆల్బ‌మ్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డును ఆమె నాలుగోసారి కైవ‌సం చేసుకున్న‌ది. మిడ్‌నైట్స్ అన్న ఆల్బ‌మ్‌కు ఆ అవార్డు ద‌క్కింది. బెస్ట్ ఆల్బ‌మ్ క్యాట‌గిరీలో నాలుగుసార్లు అవార్డు గెలిచిన తొలి సింగ‌ర్‌గా ఆమె నిలిచింది. అయితే మూడుసార్లు బెస్ట్ ఆల్బ‌మ్ గెలిచిన సింగ‌ర్ల‌లో స్టీవ్ వండ‌ర్‌, పౌల్ సిమ‌న్‌, ఫ్రాంక్ సిన‌త్రాలు ఉన్నారు.