చైనాకన్నా ముందుగానే శ్రీలంకకు చేరిన భారత్ జలాంతర్గామి

భారత్ మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య పరమైన వివాదాలు, ఉద్రిక్తతలను నేపథ్యంలో శ్రీలంక నుండి మాల్దీవులకు హిందూ మహాసముద్రం గుండా చైనా గూడచారి నౌక షియాన్‌ యాంగ్‌ హాంగ్‌-3 ప్రయాణం సాగిస్తున్న క్రమంలో శ్రీలంక తీరంకు ముందుగానే భారత్ జలాంతర్గామి చేరుకోవడంతో కలకలం రేగుతుంది.

భారత్ ఐఎన్ఎస్ కరంజ్ అనే జలాంతర్గామిని శ్రీలంకలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఒకదానికి పంపింది. దీని ద్వారా చైనా, మాల్దీవులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని భారత్ పంపినట్లయింది. భారత నౌకాదళానికి చెందిన డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఇప్పటికే కొలంబో పోర్టుకు చేరుకోగా, శ్రీలంక దానికి లాంచన ప్రాయంగా స్వాగతం పలికింది.

కొలంబోలోని న్యూఢిల్లీ రాయబారి సంతోష్ ఝా జలాంతర్గామిని సందర్శించి కమాండింగ్ ఆఫీసర్ తో,  ఆయన సిబ్బందితో సంభాషించారు. శ్రీలంక నావికా దళానికి చెందిన వందమంది సిబ్బందికి సబ్ మెరైన్ ఆన్ బోర్డు గురించి వివరించారు. 
 
ఇక జలాంతర్గామి నేడు కొలంబో నుండి బయలుదేరుతుందని భారత హై కమిషన్ పేర్కొంది. శ్రీలంక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నౌకాదళం జలాంతర్గామిని కొలంబోకు పంపింది. ఈ జలాంతర్గామిని పంపటం ద్వారా హిందూ మహాసముద్ర భద్రతా ప్రదాతగా భారతదేశపు పాత్రను హైలైట్ చేయడంతో పాటు బీజింగ్ కు, మాల్దీవులకు తద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయినది. 
 
మాల్దీవుల అధ్యక్షుడిగా మయిజు వచ్చిన తర్వాత ఆయన ద్వీపదేశమైన మాల్దీవులను చైనాకు దగ్గరగా నడిపించడం మొదలుపెట్టారు.

దీంతో మాల్దీవులకు భారత్ తో సత్సంబంధాలు దెబ్బతిన్నాయి. అనంతర పరిణామాలలో ఇరుదేశాల మధ్య అనేక పరిణామాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజా పరిణామాలతో ముందు ముందు ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ కొనసాగుతుంది.