నేటి నుంచే భారత్ రైస్ విక్రయం

దేశంలో బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. గతంలో ఎన్నడూలేని విధంగా బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం క్వింటాల్‌కు రూ.1,000 నుంచి రూ.1,500 వరకూ పెరిగి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో పెరిగిన బియ్యం ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
 
 ‘భారత్‌ రైస్‌’ పేరిట బియ్యాన్ని విక్రయించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కిలో రూ.29లకు అందజేయనున్న ఈ పథకాన్ని మంగళవారం ప్రారంభిస్తున్నారు.  భారత్‌ రైస్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో ప్రారంభించనున్నారు. 
 
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సేకరించిన 5 లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్), భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సిసిఎఫ్), కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా విక్రయించనున్నారు. 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో ఈ బియ్యం అందుబాటులో ఉంటాయి.

ఇప్పటికే భారత్‌ గోధుమపిండి కిలో రూ.27.50, భారత్‌ శనగ పప్పును రూ.60 చొప్పున నాఫెడ్‌బజార్‌.కాం తదితర ఈ-కామర్స్‌ సైట్‌లలో ప్రారంభించిన విక్రయాలకు మంచి స్పందన వస్తోంది. ప్రస్తుతం ప్రారంభించే భారత్‌ రైస్‌కు సైతం అదే స్థాయిలో ఆదరణ లభిస్తుందని కేంద్రం భావిస్తోంది. గత 18 ఏళ్లలో బియ్యం ధరలు ఇంతలా పెరగడం ఇదే మొదటిసారని జనం గగ్గోలు పెడుతున్నారు.
 
 సన్న బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కొందరు మిల్లర్లు, ట్రేడర్లు తమ మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం భారత్ రైస్ పేరుతో తక్కువ ధరకే సన్నబియ్యం అందజేయాలని నిర్ణయించింది.