టైఫాయిడ్‌పై బాగా పనిచేస్తున్న భారత్‌ బయోటెక్‌ టీకా

టైఫాయిడ్‌ జ్వరంపై భారతాస్త్రం సమర్థంగా పనిచేస్తున్నది. హైదరాబాద్‌ ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన టైఫాయిడ్‌ కంజుగేట్‌ వ్యాక్సిన్‌ టైప్‌బార్‌పై నిర్వహించిన ఫేజ్‌-3 ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయి. ఆఫ్రికా ఖండంలోని మలావిలో 9 నెలల నుంచి 12 ఏండ్ల మధ్య వయసు గల పిల్లలపై ట్రయల్స్‌ నిర్వహించారు. 
 
కనీసం నాలుగేండ్లపాటు ఈ టీకా టైఫాయిడ్‌ జ్వరానికి వ్యతిరేకంగా సమర్థంగా పనిచేస్తున్నట్టు తేలింది. వీరందరికీ 2018 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్‌ వరకు సింగిల్‌ డోస్‌ టీకా ఇవ్వగా, దాదాపు 80 శాతం వరకు టీకా సమర్థంగా పనిచేస్తున్నట్టు వెల్లడైంది.
టైఫాయిడ్‌ జ్వరం కలుషితమైన ఆహారం, పానీయాల ద్వారా వ్యాపిస్తుంది. 2019లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటి మంది దీని బారినపడగా, లక్షా 10 వేల మంది కన్నుమూశారు. ఈ జ్వరానికి అడ్డుకట్ట వేసేందుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీ టైప్‌బార్‌ టీసీవీ అనే వ్యాక్సిన్‌ను మొదటిసారి రూపొందించింది. నేపాల్‌, మలావి, బంగ్లాదేశ్‌ల  ఈ టీకాపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నది.ఇప్పటివరకూ రెండు ఫేజ్‌లు పూర్తవ్వగా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విభిన్నంగా నిర్వహించింది. ఆరోగ్యవంతమైన 28,130 మంది పిల్లలను రెండు గ్రూపులుగా విభజించి 14,069 మందికి టైప్‌బార్‌ టీకాను, 14,061 మందికి సాధారణ మెనింజోకోకల్‌ వ్యాక్సిన్‌ (బ్యాక్టీరియా వ్యాధులనుంచి తట్టుకొనేందుకు ఇచ్చే టీకా)ను ఇచ్చారు. ఎవరికి ఏ టీకా ఇచ్చారో కూడా పరిశోధకులకు తెలియదు.

నాలుగేండ్లపాటు వీరిని పరిశీలించగా, టైప్‌బార్‌ టీకా తీసుకున్న వారిలో కేవలం 24 మందికి మాత్రమే టైఫాయిడ్‌ నిర్ధారణ కాగా మెనింజోకోకల్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో 110 మంది టైఫాయిడ్‌ బారినపడ్డట్లు తేల్చారు. 9 నెలల నుంచి 2 ఏండ్ల వయసు మధ్య పిల్లల్లో 70.6 శాతం, 2 ఏండ్ల పైబడిన పిల్లల్లో 79 శాతం ఈ టీకా రక్షణ ఇస్తున్నట్టు ట్రయల్స్‌లో తేలింది.