ఇంగ్లండ్‍ను చిత్తుచేసిన భారత్

భారత్ -ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ పై 106 పరుగుల తేడాతో భారత జట్టు గెలిచింది. దీంతో ఐదు టెస్టులో సిరీస్ లో భారత్-ఇంగ్లాండ్ జట్లు చెరో టెస్టు గెలిచి సమంగా ఉన్నాయి.  విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజైన సోమవారం భారత్ 106 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. 
నాలుగో రోజు భార‌త బౌల‌ర్లు చెల‌రేగ‌డంతో ఇంగ్లండ్ 292 ప‌రుగుల‌కు ఆలౌట‌య్యింది. టామ్ హ‌ర్ట్లే(36)ను బుమ్రా బౌల్డ్ చేసి భార‌త్‌కు విజ‌యాన్ని అందించాడు.  ఓవ‌ర్‌నైట్ స్కోర్ 67/1తో నాలుగో రోజు ఆట మొద‌లెట్టిన ఇంగ్లండ్ ధాటిగా ఆడింది. నైట్ వాచ్‌మ‌న్ రెహాన్ అహ్మ‌ద్‌(23) బౌండ‌రీల‌తో విరుచుకుప‌డ్డాడు. అయితే.. అక్ష‌ర్ ప‌టేల్ అత‌డికి చెక్ పెట్టి వికెట్ల వేట‌ను అరంభించాడు. ఆ త‌ర్వాత రంగంలోకి దిగిన అశ్విన్ ఉప్ప‌ల్ టెస్టు హీరో ఓలీ పోప్‌(23)ను ఔట్ చేశాడు. 
 
స్లిప్‌లో రోహిత్ శ‌ర్మ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో పోప్ పెవిలియ‌న్‌కు చేరగా ఆ కాసేప‌టికే రివ‌ర్స్ స్వీప్‌తో రెండు బౌండ‌రీలు బాదిన‌ జో రూట్‌(16)ను య‌ష్ బోల్తా కొట్టించాడు. దాంతో, స్టోక్స్ సేన 154 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.  స్పిన్న‌ర్లు అశ్విన్, కుల్దీప్ విజృంభించ‌డంతో తొలి సెష‌న్‌లో ఇంగ్లండ్ ఆరు వికెట్లు కోల్పోయింది. 
 
లంచ్‌కు ముందు ఓవ‌ర్లో డేంజ‌ర‌స్ బెయిర్‌స్టో (26)ను బుమ్రా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. అప్ప‌టికీ ఓపెనర్ జాక్ క్రాలే (73), జానీ బెయిర్‌స్టో(26) క్రీజులో ఉండ‌డంతో మ్యాచ్ దాదాపు ఇంగ్లండ్ వైపే ఉంది. అయితే.. చైనామ‌న్ కుల్దీప్ యాద‌వ్ సూప‌ర్ డెలివరీతో క్రాలే ఎల్బీగా వెనుదిరిగాడు. లంచ్‌కు ముందు ఆఖ‌రి ఓవ‌ర్లో బుమ్రా.. డేంజ‌ర‌స్ బెయిర్‌స్టోను ఎల్బీగా ఔట్ చేసి ఇంగ్లండ్‌ను ఓట‌మి అంచుల్లోకి నెట్టాడు.  లంచ్ స‌మ‌యానికి 6 వికెట్ల న‌ష్టానికి 194 ప‌రుగులు చేసింది.
 
టెయిలెండ‌ర్ల‌తో క‌లిసి పోరాడ‌తాడ‌నుకున్న‌ కెప్టెన్ బెన్ స్టోక్స్(11) ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన టామ్ హ‌ర్ట్లే(36), బెన్ ఫోక్స్(36) కౌంట‌ర్ అటాక్‌తో భార‌త బౌల‌ర్ల‌ను కొద్దిసేపు విసిగించారు. కానీ, బుమ్రా ఈ ఇద్ద‌రిని పెవిలియ‌న్ పంప‌డంతో భార‌త్ విజ‌య‌ఢంకా మోగించింది. తొలి ఇన్నింగ్స్‌లో య‌శ‌స్వీ జైస్వాల్‌(209) డబుల్ సెంచ‌రీతో చెల‌రేగ‌గా టీమిండియా ర‌న్స్ కొట్టింది.
 
 ఆ త‌ర్వాత బుమ్రా ఆరు వికెట్ల‌తో ఇంగ్లండ్‌ను దెబ్బ‌కొట్టాడు. దాంతో, ప‌ర్యాట‌క జ‌ట్టు కుప్ప‌కూలింది. ఇక అనంత‌రం రెండో ఇన్నింగ్స్‌లో అండ‌ర్స‌న్ ధాటికి 32 ప‌రుగ‌లుకే ఓపెన‌ర్ల‌ను కోల్పోయిన భార‌త్‌ను.. శుభ్‌మ‌న్ గిల్(104) సెంచ‌రీతో ఆద‌కున్నాడు. అక్ష‌ర్ ప‌టేల్(45) కీల‌క ఇన్నింగ్స్ ఆడిన‌ప్ప‌టికీ టామ్ హ‌ర్ట్లే నాలుగు వికెట్లు తీయ‌డంతో 255 ప‌రుగుల‌కే ఆలౌట‌య్యింది.