
సార్వత్రిక ఎన్నికలకు ముందు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వరస దెబ్బలు తగులుతున్నాయి.2018లో జరిగిన ఇమ్రాన్ బుష్రా ఖాన్‌ల వివాహం చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని పేర్కొన్న కోర్టు శనివారం ఆ ఇద్దరికీ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.ఈ వారంలో ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా వచ్చిన మూడో తీర్పు ఇది.
అంతేకాదు వచ్చే గురువారం పాక్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయనకు తగిలిన తాజా ఎదురుదెబ్బ ఇది. ఇప్పటికే ఇమ్రాన్ పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌కు ప్రభుత్వ రహస్యాలు లీక్ చేసినందుకు పదేళ్లు, ప్రభుత్వ గిఫ్ట్‌లను విక్రయించినందుకు బుష్రాఖాన్‌తో పాటుగా 14 ఏళ్ల జైలు శిక్షలు విధిస్తూ కోర్టులు ఇటీవల తీర్పు చెప్పాయి. కాగా తాజా కేసులో ఇరువురికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల (పాక్ కరెన్సీ) చొప్పున జరిమానా కూడా విధించినట్లు ఎఆర్‌వై న్యూస్ తెలిపింది.
బుష్రా తన మాజీ భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇమ్రాన్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇస్లాం మత సంప్రదాయాల ప్రకారం వేచి ఉండాల్సిన సమయాన్ని పూర్తి చేయకుండానే ఆయనను వివాహం చేసుకున్నారనేది ఆమెపై ఉన్న అభియోగం. తొలి సారి పాక్ ప్రధానిగా ఎన్నిక కావడానికి ఏడు నెలల ముందు 2018 జనవరిలో రహస్యంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఇద్దరూ ‘నిఖా’ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఇద్దరూ గడువు ముగియడానికి ముందే వివాహం చేసుకున్నారా? అనే దానిపై వివాదం ఉంది. జనవరిలో జరిగిన పెళ్లిపై వచ్చిన వార్తలను మొదట ఖండించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్‌ఎ ఇన్సాఫ్(పిటిఐ) కొద్ది వారాల తర్వాత దాన్ని ధ్రువీకరించింది. అయితే తాము ఏ తప్పూ చేయలేదని ఈ ఇరువురూ వాదిస్తున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం రావల్పిండిలోని జైల్లో ఉండగా, ఆయన భార్య మాత్రం ఇస్లామాబాద్‌లోని తమ భవనంలోనే శిక్షాకాలం గడపడానికి కోర్టు అనుమతించింది.
ఈ జైలు శిక్ష కక్ష సాధింపు చర్య అని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ విమర్శించింది. హడావుడిగా, ఎలాంటి నిబంధనలు పాటించకుండా విచారణ జరిపారని ఆరోపించింది. కనీసం సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేదని, ఇది చట్టాన్ని అపహాస్యం చేయడమేనని వ్యాఖ్యానించింది. పాకిస్తాన్ లో ఫిబ్రవరి 8న జాతీయ ఎన్నికలు జరగనున్నాయి.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక