హక్కుల కార్యకర్త హర్ష్ మందర్‌పై సిబిఐ కేసు

మానవ హక్కుల కార్యకర్త హర్ష్ మందర్‌పైన, ఆయన నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థపైన విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం ఉల్లంఘన ఆరోపణలపై సిబిఐ కేసు నమోదు చేసి శుక్రవారం ఆయన ప్రాంగణాలను సోదా చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్‌సిఆర్‌ఎ చట్టంలోని సెక్షన్ 3 కింద ఒక రిజిస్టర్డ్ వార్తాపత్రికకు చెందిన విలేకరులు, కాలమిస్టులు, కార్టూనిస్టులు, ఎడిటర్, యజమాని, ప్రచురణకర్త విదేశీ విరాళాలను స్వీకరించరాదని హోం మంత్రిత్వశాఖ గతంలో ప్రకటించింది.

అయితే హర్ష్ మందర్ వార్తాపత్రికలు, వెబ్ పోర్టల్స్‌లో వ్యాసాలు, కాలమ్స్ రాస్తున్నారు. ఎఫ్‌సిఆర్‌ఎకు చెందిన వివిధ నిబంధనలు ఉల్లంఘించినందుకు మందర్‌పైన, సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్‌పైన సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. గత యుపిఎ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ సారథ్యంలోని జాతీయ సలహా మండలిలో సభ్యుడిగా మందర్ పనిచేశారు. 

ఆయన అమన్ బిరాదరి అనే ఎన్‌జిఓ వ్యవస్థాపకుడు. అమన్ బిరాదరి ఎఫ్‌సిఆర్ పరిధిలోకి రాని సంస్థ అని హోం శాఖ తెలిపింది. ఎఫ్‌సిఆర్‌ఎ పరిధిలోని రాని ఎన్‌జిఓలకు విదేశీ విరాళాలను బదిలీ చేయడంలో సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ సంధానకర్తగా వ్యవహరించింది.