జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ అరెస్ట్, రాజీనామా

జార్ఖండ్‌ సీఎం సోరెన్‌ అరెస్ట్, రాజీనామా

* కొత్త సీఎంగా చంపై సోరెన్‌!

భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. పలు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సొరేన్‌ విచారించిన ఈడీ.. అనంతరం అదుపులోకి తీసుకున్నది. 
 
విచారణలో అధికారులు అడిగిన ప్రకొశ్నలకు సొరేన్‌ సమాధానం దాటవేస్తున్న క్రమంలో మనీలాండరింగ్‌ నియంత్రణ చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నట్టు ఈడీ వర్గాలు వెల్లడించాయి. హేమంత్‌ సొరేన్‌ను ఈడీ గురువారం స్థానిక ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టి, కస్టడీ విచారణకు రిమాండ్‌ కోరే అవకాశం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 
 
అరెస్టుకు ముందే ముఖ్యమంత్రి పదవికి సొరేన్‌ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాతనే అరెస్టు మెమోపై సంతకం చేస్తానని హేమంత్‌ సొరేన్‌ ఈడీ అధికారులకు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. దీంతో ఈడీ అధికారులు ఆయన్ను గవర్నర్‌ వద్దకు తీసుకెళ్లారు. కొత్త సీఎంగా జేఎంఎం సీనియర్‌ నేత, రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ఉన్న చంపై సొరేన్‌ను అధికార పక్షం ప్రతిపాదించింది. హేమంత్‌ సొరేన్‌ రాజీనామా అనంతరం చంపై సొరేన్‌ నేతృత్వంలోని అధికారపక్ష ఎమ్మెల్యేలు గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను సాయంత్రం కలిశారు. 
 
తనకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇందుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారని రాజ్‌భవన్‌ వర్గాలు వెల్లడించాయి. సొరేన్‌ అరెస్టుకు నిరసనగా ఆదివాసీ సంఘాలు గురువారం జార్ఖండ్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి. అరెస్టును వ్యతిరేకిస్తూ సొరేన్‌ హైకోర్టును ఆశ్రయించారు.
 
ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని హేమంత్ సొరేన్ నిర్ణయించడంతో, శాసనసభా పక్ష నేతగా ఛాంపై సొరేన్ ను ఎన్నుకున్నట్లు ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ తెలిపారు. ఎమ్యెల్యేలు అందరూ తమతోనే ఉన్నారని స్పష్టం చేశారు. ఆయన రాజీనామా నేపథ్యంలో రాజ్‌భవన్‌కు చేరుకున్న  జేఎంఎం ఎమ్మెల్యేల వెంట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
 
`ఝార్ఖండ్ టైగర్’ ఛాంపై సొరేన్
 
`ఝార్ఖండ్ టైగర్’గా పేరొందిన ఛాంపై సొరేన్ ఏడు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. మొదటిసారి స్వతంత్ర ఎమ్యెల్యేగా ఎన్నికై, తర్వాత జేఎంఎంలో చేరారు. ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రం కోసం జరిపిన ఉద్యమంలో కీలక  పాత్ర వహించారు.
 
జార్ఖండ్‌ సీఎం విచారణ ఈడీ విచారణ నేపథ్యంలో రాంచీలోని రాజ్‌భవన్, సీఎం నివాసం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ను విధించారు. సీఎం సోరెన్ నివాసం ఆవరణలోకి రెండు మినీ బస్సులు తీసుకువచ్చారు. అలాగే పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. హేమంత్ సోరెన్‌ను ఇదే కేసులో గతంలో జనవరి 20న ప్రశ్నించగా,  ఆ రోజు విచారణ పూర్తి కాలేదని ఓ అధికారి తెలిపారు. ఇప్పటి వరకు ఆయనను ఏడు గంటలకుపైగా విచారించారు.  జార్ఖండ్‌లో ‘మాఫియా భూ యాజమాన్యాన్ని అక్రమంగా మార్చే పెద్ద రాకెట్’ దర్యాప్తులో భాగంగా సోరెన్‌ను విచారిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది కార్యకర్తలు, అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా మద్దతుదారులు నిరసన వ్యక్తం చేశారు. రాంచీలోని మోర్హబడి మైదానంలో భేటీ అయ్యారు. హేమంత్‌ సోరెన్‌ను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని మద్దతుదారులు ఆరోపించారు.

సొరేన్ భార్యకు దక్కని అవకాశం

ఇలా ఉండగా, ఈడీ హేమంత్‌ సొరేన్‌ను అరెస్టు చేసే పక్షంలో ఆయన భార్య కల్పనా సొరేన్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం సాగింది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగునుండటం.. సమయం ఎక్కువగా లేకపోవడంతో పార్టీ ఆ ఆలోచనను విరమించుకొన్నట్టు తెలిసింది. కల్పనా సొరేన్‌ ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా లేరు. 

రాష్ట్ర అసెంబ్లీ టర్మ్‌ చివరి ఏడాదిలో ఉప ఎన్నికలు నిర్వహించేందుకు వీలులేనందున.. ఒకవేళ ఆమెను కొత్త సీఎంగా ప్రతిపాదించినా, ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండదు. మరోవైపు కల్పానా సొరేన్‌ను సీఎం చేసే ఆలోచనను కూడా జేఎంఎం అధినేత శిబు సొరేన్‌ పెద్ద కోడలు, గత 14 ఏండ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సీతా సొరేన్‌ వ్యతిరేకించారు.