టిఎస్ పీఎస్సి చైర్మన్ నియామకంపై కాంగ్రెస్ లో దుమారం

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కీలక పదవులలో అధికారుల నియామకంలో తొందరపాటు లేకుండా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలక పదవులలో పనిచేసిన అధికారుల పట్ల కక్షసాధింపు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దానితో ఇప్పటికీ కొందరు కీలక పదవులలో కొనసాగుతున్నారు. 
 
మరోవంక, బదిలీ చేసినప్పటికీ తగు ప్రాధాన్యత గల పోస్టులు చేస్తున్నారు.  ముఖ్యంగా విద్యుత్ శాఖలో అధికారుల నియామకాలు, తెలంగాణకు అత్యంత కీలకమైన రాజధాని హైదరాబాద్ నగరంలోని పోలీస్ అధికారుల పోస్టింగ్ ల విషయంలో కూడా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పుపట్టడం లేదు. 
 
తన ప్రభుత్వంకు మంచి ఇమేజ్ వచ్చేందుకు, ముఖ్యంగా త్వరలో జరుగనున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివాదాస్పదం కానీ అధికారులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది.  అయితే తాజాగా  కీలకమైన టిఎస్ పీఎస్సి కొత్త చైర్మన్ గా వివాదాస్పదమైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించడం కాంగ్రెస్ లోనే కలకలం రేపుతున్నాయి. 
 
గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీ ఉద్యోగ నియామకాలు. అందుకోసం టిఎస్ పీఎస్సి ప్రక్షాళన తక్షణం చేపట్టాల్సి ఉంది. గత ప్రభుత్వం నియమించిన చైర్మన్, ఇతర సభ్యులు రాజీనామా చేసిన్నప్పటికీ వాటిని సాంకేతిక కారణాల దృష్ట్యా గవర్నర్ వెంటనే ఆమోదించాక పోవడంతో ప్రక్షాళనలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం కోరడంతో ఆమె ఆమోదించారు.
 
 గత కెసిఆర్ సర్కారుపై నిరుద్యోగ యువతలో పెద్ద ఎత్తున ఉన్న వ్యతిరేకత కూడా కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించిన అంశాల్లో ఒకటి. అందుచేత టిఎస్ పీఎస్సి చైర్మన్ నియామకం కీలకంగా మారింది.  కెసిఆర్ ప్రభుత్వంలో సుదీర్ఘకాలం డీజీపీగా పని చేసిన మహేందర్ రెడ్డిపై ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఎన్నో విమర్శలు గుప్పించారు.
 
ఆయన హయాంలో పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా మారారని, ప్రతిపక్ష కార్యకర్తలను వేధించారని, ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఎవ్వరు నిరసనలు చేపట్టినా కర్కశంగా వ్యవహరించారని, ఎందరిపైననే అక్రమంగా కేసులు నమోదు చేశారని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఒక దశలో `సిగ్గు ఉంటె డిజిపిగా రాజీనామా చేయి’ అంటూ స్వయంగా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
 
పలు సందర్భాలలో రాజకీయ వత్తిడుల మేరకు డిజిపి పనిచేశారని కూడా ఆరోపణలు చేశారు. అంతే కాకుండా ఆయన గత ప్రభుత్వంలో పూర్తిగా అప్పటి బిఆర్ఎస్ సర్కారుకు అనుకూలంగా పనిచేశారని పలువురు కాంగ్రెస్ నేతలు కూడా విమర్శలు చేశారు. ఒక విధంగా తెలుగు రాష్ట్రాలలో ఐదేళ్లకు పైగా డిజిపి పదవిలో కొనసాగిన వారు మరెవ్వరు లేరు.
 
ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సర్కారు ఆయన్ను టిఎస్ పీఎస్ సి చైర్మన్ గా నియమించడం విస్మయం కలిగిస్తోంది.  కొంత మంది మంత్రులు సైతం ఈ నిర్ణయంపై అవాక్కు అయినట్లు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.  కాంగ్రెస్ కు సన్నిహితంగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని ఈ పదవిలో నియమిస్తారని అందరూ భావించారు. పలువురు మంత్రులు కూడా ప్రతిపాదించారు.
 
కానీ, అనూహ్యంగా మహేందర్ రెడ్డి పేరు తెరపైకి రావడంతో కాంగ్రెస్ వర్గాలు విస్మయం వ్యక్తం చేశారు. కొందరు మంత్రులు కూడా ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారించినట్లు తెలుస్తున్నది. తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయినా, కనీసం మంత్రులతో కూడా చర్చించకుండా మహేందర్ రెడ్డి నియామకం జరగడంతో వారంతా దిగ్బ్రాంతి చెందారు.
 
వెంటనే నల్గొండ జిల్లాకు చెందిన ఓ మంత్రి నేరుగా రేవంత్ రెడ్డిని కలిసి ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. ఈ విషయంలో మౌనం వహించడం మినహా ఆయన కనీసం పార్టీలో వ్యతిరేకిస్తున్న వారికి నచ్చచెప్పే ప్రయత్నం కూడా చేయకపోవడంతో విస్మయం చెందుతున్నారు. ఈ విషయమై వెంటనే ఏఐసీసీ పెద్దలకు ముఖ్యమంత్రి వ్యవహారంపై ఫిర్యాదు చేసినట్లు చెబుతున్నారు.
 
ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి కుటుంబాల మధ్య గల సాన్నిహిత్యంల గురించి కాంగ్రెస్ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరి భార్యలు దగ్గరి బంధువులని, రెండు కుటుంబాల మధ్య ఇతరత్రా వ్యవహారాలలో సహితం సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. మరోవంక, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం కష్టపడిన వారిని కాకుండా తన `సామజిక వర్గం’కు చెందిన వారికే వరుసగా కీలక పదవులు కట్టబెడుతున్నారని అసంతృప్తి కూడా కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తం అవుతుంది.