
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కొన్ని శతాబ్ధాలు ఎదురుచూశామని, రామ్‌లల్లా ఇప్పుడు భవ్య మందిరంలో కొలువుదీరినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో బుధవారం కొత్త పార్లమెంట్ భవనంలో ఉభయసభలను ఉద్దేశించిఆమె ప్రసంగిస్తూ కోట్లాది దేశ ప్రజల ఆశయం నెరవేరిందని తెలిపారు.
రామమందిర నిర్మాణానికి అన్ని ఆటంకాలు అధిగమించి, అంగరంగ వైభవంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించుకున్నామని వివరించారు. ఎన్నో ఏళ్ల భారతీయుల కల అయిన అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమైందని హర్షం వ్యక్తం చేశారు. ఆ పండుగను దేశ ప్రజలు సంబురంగా జరుపుకున్నట్లు ఆమె చెప్పారు.
గత ఏడాది భారత్ ఎన్నో విజయాలను సాధించిందని చెబుతూ మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లాంటి స్కీమ్‌లు ఇండియాను మరింత బలోపేతం చేశాయని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ చాలా వేగంగా ఎదిగిందని ఆమె స్పష్టం చేశారు. భారత సంస్కృతి, సభ్యత చైతన్యవంతమైందని చెబుతూ శాంతినికేతన్ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిందని గుర్తు చేశారు.
భగవాన్ బిర్సాముండా జన్మదినాన్ని జన్ జాతీయ దివస్‌గా జరుపుకొంటున్నామని తెలిపారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం గర్వకారణం అని వ్యాఖ్యానించారు. ఇటీవల ప్రపంచం రెండు భారీ యుద్ధాలను, కరోనా మహమ్మారిని చూసిందని పేర్కొంటూ ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితి ఉన్నా తమ ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని అదుపులోనే ఉంచిందని ఆమె కొనియాడారు.
సాధారణ భారతీయులపై ప్రభావం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు ముర్ము తెలిపారు. యువ శక్తి, మహిళా సాధికారత, రైతులు, పేదలపైనే భారత అభివృద్ధి ఆధారపడి ఉందని ఆమె స్పష్టం చేశారు. గరీబీ హటావో అన్న నినాదాన్ని చిన్నపటి నుంచి వింటున్నామని, కానీ తొలిసారి విస్తారమైన స్థాయిలో పేదరిక నిర్మూలన జరిగిందని ఆమె తెలిపారు.
జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్‌ను రద్దు చేయడం చరిత్రే అంటూ ఎన్నో దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక పనులను గత పదేళ్లలో జాతీయ ప్రయోజనాల కోసం పూర్తి చేశామని రాష్ట్రపతి వివరించారు. జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించి, ప్రపంచదేశాల్లో ఇండియా ఐడెంటిటీని బలోపేతం చేశామని చెప్పారు.
మన దేశం ఆసియా క్రీడల్లో భారత్ వంద పతకాలు సాధించిందని ఆమె ప్రశంసించారు. అటల్ టన్నెల్‌ను కూడా పూర్తి చేశామని, ఇటీవల భారత్ ఎన్నో విజయాలు నమోదు చేసిందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా రికార్డు క్రియేట్ చేసిందని ఆమె వివరించారు. చంద్రుడిపై దక్షిణ ద్రువం చేరుకున్న తొలి దేశంగా కూడా ఇండియా నిలిచిందని చెప్పారు.
“చంద్రుడి దక్షిణధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. ఆదిత్య ఎల్-1 మిషన్‌ను భారత్ దిగ్విజయంగా ప్రయోగించింది. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించింది. జీ20 సమావేశాలను భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఆసియా పారా క్రీడల్లో భారత్ 111 పతకాలు సాధించింది. భారత్‌లో తొలిసారిగా నమో భారత్ రైలును ఆవిష్కరించాం.” అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తన ప్రసంగంలో వెల్లడించారు.
“దేశంలో 5జీ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కొత్త క్రిమినల్ చట్టాన్ని తీసుకొచ్చాం. ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్‌తో ముందుకెళ్తున్నాం. రక్షణరంగం, అంతరిక్ష రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగాయి. మన చిన్నప్పటి నుంచి గరీబీ హఠావో నినాదాలు వింటున్నాం. ప్రస్తుతం దేశంలో పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంకింగ్ వ్యవస్థల్లో భారత్ ఒకటి. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా మన బలాలుగా మారాయి” అని రాష్ట్రపతి వివరించారు.
నారీశక్తి వందన్ అధినీయం చట్టం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం స్థానాలు కేటాయించామని తెలిపారు. కొత్తగా నిర్మించిన పార్లమెంట్ బిల్డింగ్‌లో ప్రభుత్వ పథకాలపై అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ము తెలిపారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది