జ్ఞానవాపి ప్రాంగణంలో పూజలకు కోర్టు అనుమతి

జ్ఞానవాపి కేసులో కీలక మలుపు తిరిగింది. మసీదు ప్రాంగణంలో పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో జ్ఞానవాపిలో హిందువు దేవతా విగ్రహాలకు పూజలు చేసే అవకాశం దక్కింది.  జ్ఞాన వాపి మసీదు దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు బుధవారం హిందూ పక్షానికి అనుమతి ఇచ్చింది. 
 
అక్కడ పూజలు నిర్వహించడానికి శ్రీ కాశీవిశ్వనాథ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారికి అవకాశం కల్పించాలని కోర్టు రిసీవర్ ను ఆదేశించింది. జ్ఞాన్ వాపి మసీదు  దక్షిణ భాగంలోని సెల్లార్ లో మరో వారం రోజుల్లో పూజలను ప్రారంభిస్తామని హిందూ పక్షం తరఫున వాదించే న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెలల్డించారు. ఇష్ట దైవానికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని స్పష్టం చేశారు.
జ్ఞానవాపి వ్యాసాజీ బేస్‌మెంట్‌లో పూజలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ జిల్లా డాక్టర్‌ అజయ్‌ కృష్ణ విశ్వేష్‌ ఇరువర్గాలు వాదనలు విన్నది. బేస్‌మెంట్‌లో పూజలు చేసేందుకు హిందువులకు అనుమతి లభించింది.  శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్, విష్ణు శంకర్ జైన్, సుధీర్ త్రిపాఠి, సుభాష్ నందన్ చతుర్వేది, దీపక్ సింగ్ కోర్టులో వాదనలు వినిపించారు. నంది విగ్రహానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బారికేడింగ్‌ను తెరిచేందుకు అనుమతించాలని కోరారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు 1993కి ముందు తరహాలోనే బేస్‌మెంట్‌లో పూజలకు వెళ్లేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఇంతేజామియా మసీదు కమిటీ తరఫున ముంతాజ్‌ అహ్మద్‌, ఇఖ్లాక్ అహ్మద్ అభ్యంతరం వ్యక్తం చేసింది. బేస్‌మెంట్‌ మసీదులో భాగమని స్పష్టం చేశారు. అక్కడ పూజలు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారు. 
 
బేస్‌మెంట్‌ మసీదులో భాగమని, అది వక్ఫ్‌బోర్డు ఆస్తి అని తెలిపారు. అక్కడ పూజలు చేయకూడదని వాదించారు. అయితూ, ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు హిందువులకు పూజలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పూజలు చేసుకునేలా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా హిందూపక్షం న్యాయవాది మాట్లాడుతూ కోర్టు ఆదేశం కీలక మలుపు అని తెలిపారు.
 
కాగా, ఈ తీర్పును పై కోర్టులో సవాలు చేస్తామని అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాది అఖ్లాక్ అహ్మద్ తెలిపారు. పిటిషన్ ను కొట్టివేయాలని మసీదు కమిటీ చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.

జ్ఞానవాపి   మసీదు నిర్మాణానికి ముందు అక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక నిర్ధారించిన విషయం తెలిసిందే. కాగా, మసీదు లో సీల్ చేసి ఉన్న ప్రాంతాన్ని కూడా తవ్వి, సంపూర్ణంగా మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు. 

గతంలో అక్కడ శివలింగం ఉందని, అందువల్ల ఆ శివలింగానికి ఎలాంటి నష్టం కలిగించకుండా, ఆ శివలింగం చుట్టూ నిర్మించిన కృత్రిమ / ఆధునిక గోడలు / అంతస్తులను తొలగించాలని వారు సుప్రీంకోర్టును కోరారు. అలాగే, అక్కడ లభించిన శివలింగం స్వభావాన్ని, చరిత్రను నిర్ణయించడానికి శివలింగం చుట్టూ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతుల్లో అవసరమైన తవ్వకాలు చేపట్టాలని వారు కోరారు. ఆ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే వారణాసి జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.