ఏసీసీ చీఫ్‌గా మూడోసారి ఎన్నికైన జై షా

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెక్రటరీ జై షా మరోసారి ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఏసీసీ చైర్మన్‌గా ఎన్నికవడం జై షాకు ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం. శ్రీలంక క్రికెట్‌ అధ్యక్షుడు షమ్మి సిల్వ జై షా అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించగా ఏసీసీ సభ్యులంతా దానికి మద్దతు పలికారు. 
 
ఇండోనేషియాలోని బాలి వేదికగా జరిగిన ఏసీసీ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో జై షాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఏసీసీ ప్రకటించింది.  జై షా తొలిసారి 2021లో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ వారసుడిగా ఈ బాధ్యతలు చేపట్టాడు.  జై షా హయాంలో ఏసీసీ 2022లో ఆసియా కప్‌ టీ20, 2023లో వన్డే ఫార్మాట్‌ లలో ఈ టోర్నీని విజయవంతంగా నిర్వహించారు. 
 
ఏసీసీ చైర్మన్‌గా ఎన్నికవడంపై జై షా స్పందిస్తూ ‘ఏసీసీ బోర్డు నాపై నమ్మకముంచినందుకు ధన్యవాదాలు. ఆసియాలో ఇంకా ఈ క్రీడ (క్రికెట్‌)ను విస్తరించేందుకు మా వంతు కృషి చేస్తాం..’ అని తెలిపారు. జై షా హయాంలో బంగ్లాదేశ్‌, ఇండియా, పాకిస్తాన్‌, శ్రీలంకలు క్రికెట్‌ పవర్‌ హౌస్‌గా మారాయని షమ్మి సిల్వ తెలిపాడు.
 
వాస్తవానికి జై షా ఏసీసీ చైర్మన్‌ పదవితో పాటు బీసీసీఐ సెక్రటరీగానూ వైదొలుగుతాడని, ఆయన ఈ ఏడాది నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా జై షా ఏసీసీ చైర్మన్‌గా మూడోసారి ఎన్నికవడంతో మరి ఐసీసీ చైర్మన్‌ పరిస్థితి ఏంటని, జై షా ఆ పోటీ నుంచి తప్పుకున్నారా? అని క్రికెట్‌ వర్గాలలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి.