ఇక ఎప్పటికీ ఎన్డీయే కూటమిలో కొనసాగుతూ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. మహాకూటమి నుంచి బయటపడి బీజేపీ మద్దతుతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనంతరం నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. విపక్ష కూటమికి మరో పేరు ఎంచుకోవాలని తాను కోరినా ఇండియా పేరును ఖరారు చేశారని నితీష్ ఆరోపించారు.
ఇప్పటివరకూ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తుందని వారు నిర్ణయించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. దీంతో తాను విపక్ష కూటమిని వీడి గతంలో తన ప్రయాణం సాగించిన వారి పక్షానికి చేరుకున్నానని చెప్పారు. ఇక ఇప్పటినుంచి ఎన్డీయే కూటమిలోనే ఎప్పటికీ కొనసాగుతామని, . బిహార్ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడతానని వెల్లడించారు. నూతన ప్రభుత్వం ఫిబ్రవరి 10న రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కొంటుందని తెలిపారు.
“రాష్ట్ర ప్రజల కోసం అహర్నిషలు కష్టపడుతూనే ఉంటా. ఇండియా కూటమికి మరో పేరు పెట్టాలని కాంగ్రెస్‌ను కోరాను. కానీ వారు నా మాట వినలేదు. నేను చేసిన ఒక్క సూచనను కూడా వారు పరిగణలోకి తీసుకోలేదు. వారు.. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటి వరకూ నిర్ణయించలేదు. కూటమి నేతల ప్రవర్తనతో విసిగెత్తిపోయాను. చివరికి మా పాత మిత్రపక్షం ఎన్డీఏకు తిరిగి వచ్చాను. ఇకపై ఎక్కడికీ వెళ్లను. ఫిబ్రవరి 10న కొత్త ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతోంది” అని తెలిపారు.
ఇలా ఉండగా, నితీశ్ కుమార్ దారిలో మరికొన్ని పార్టీలు మళ్లీ బీజేపీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి! ఈ మేరకు ఆయా పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని బీజేపీ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. పంజాబ్‌కు చెందిన అకాలీదళ్ కూడా తమతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నదన్న ఆయన కర్ణాటకలో జేడీఎస్ ఇప్పటికే తమతో కలిసి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం దక్షిణాదికి చెందిన ఒకటి, రెండు పార్టీలతో పొత్తుపై చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. తమిళనాడులో హీరో విజయ్ స్థాపించబోయే పార్టీతో బీజేపీ రహస్య పొత్తు కుదుర్చుకుంటుందని తమిళనాట ఊహాగానాలు వెలువడుతున్నాయి. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో విజయ్ ఒక్కరే కావడంతో కొన్ని స్థానాల్లో బీజేపీ గెలుపు కోసం విజయ్, ఆయన అభిమాన సంఘాలు పనిచేసేలా ఒప్పందం ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతున్నది.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం