మణిశంకర్ అయ్యర్ కుమార్తె ‘రామ్‌మందిర్’ పోస్ట్‌పై దుమారం

* కాలనీ నుండి ఖాళీ చేయాలని నోటీసు
అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠపై సోషల్ మీడియాలో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్ కుమార్తె సురణ్య అయ్యర్ చేసిన పోస్ట్ వివాదం సృష్టిస్తోంది. రామమందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి వ్యతిరేకంగా తాను నిరసనకు దిగనున్నట్టు జనవరి 20న ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో సురణ్య పేర్కొన్నారు. 
 
దీనిపై దక్షిణ ఢిల్లీ జాంగ్‌పుర రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోస్టింగ్‌ల విషయంలో సంయమనం పాటించాలని, లేదంటే వేరే కాలనీకి వెళ్లాలని సురణ్యకు రాసిన ఒక లేఖలో సూచించింది. ఢిల్లీలోని జంగ్‌పురాలోని నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా మణిశంకర్‌, ఆయన కుమార్తె సూర్య అయ్యర్‌లకు నోటీసులు పంపింది.  గతంలో జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఇతర నివాసితుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా, శాంతికి భంగం కలిగించేలా పోస్టులు చేయవద్దని ఆ నోటీసుల్లో కోరింది. ”మీ పోస్టు సరైనదని మీరు భావిస్తే.. అటువంటి విద్వేషాన్ని ఆమోదిస్తూ కళ్లు మూసుకునే మరో కాలనీకి దయచేసి వెళ్లిపోవాలని మేము సూచిస్తున్నాము ” అని పేర్కొంది.  మణిశంకర్‌ అయ్యర్‌ తన కుమార్తె పోస్టును ఖండించాలని లేదా ఇల్లు వదిలి వెళ్లాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు.

విద్యావంతురాలైన సూర్య అయ్యర్‌కి ఇది తగదని, 500 ఏళ్ల తర్వాత రామమందిరాన్ని నిర్మిస్తున్నారని, అది కూడా సుప్రీంకోర్టు 5-0 మెజారిటీతో తీర్పు ఇచ్చిన తర్వాతేనన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎ పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించాలని, రాజ్యాంగం కల్పించిన వాక్‌స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేయడం తగదని పేర్కొంది.

‘‘మీరు దేశ శ్రేయస్సు కోసం రాజకీయాల్లో ఏమైనా చేయవచ్చు. కానీ మీ చర్యలు కాలనీకి మంచి లేదా చెడ్డపేరు తీసుకువస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.  ఇకపై ఇటువంటి పోస్టులు / కామెంట్లు చేయడం మానుకోవాలని ’’ అని ఆ నోటీసులో హితవు చెప్పారు.

”శాంతిని కోరుకునే లొకాలిటీలో శరణ్య అయ్యర్ 3 రోజుల నిరాహార దీక్ష చేస్తామనడం, విద్యేష పూరిత ప్రసంగం చేయడం దురదృష్టకరం. ఈ లొకాలిటీలో చాలామంది సర్వం కోల్పోయి ఇక్కడకు వచ్చిన పాకిస్థానీయులు ఉన్నారు. ఇలాంటి తరుణంలో ప్రజల మధ్య అపోహలు, విద్వేషాలకు తావిచ్చే చర్యలకు దిగకుండా మంచి సిటిజన్‌గా ఉండాలని మేము కోరుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. 

 ప్రజలను రెచ్చగొట్టి వారి మధ్య ద్వేషాన్ని, అపనమ్మకాన్ని సృష్టించవద్దని అసిసోయేషన్‌ హెచ్చరించింది. రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకకు నిరసనగా తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు జనవరి 20న ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో సూర్య అయ్యర్‌ ప్రకటించారు. ఈ దీక్ష తోటి ముస్లింలకు  ప్రేమ, బాధను వ్యక్తం చేస్తుందని పేర్కొన్నారు.