రెండో టెస్టుకు జడేజా, రాహుల్ దూరం.. సర్ఫరాజ్ నిరీక్షణకు తెర

తొలి టెస్టులో ఓటమితో నైరాశ్యంలో ఉన్న భారత్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే ఆల్ రౌండర్ జడేజా దూరం కాగా.. తాజాగా ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా రెండో టెస్టుకు దూరమయ్యాడు. కుడి తొడ నొప్పితో బాధపడున్న రాహుల్ వైజాగ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో ఆడడని బీసీసీఐ స్పష్టం చేసింది. అయితే గతంలో ఐపీఎల్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ కుడి తొడకే గాయమైంది. సర్జరీ అనంతరం నాలుగు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగి వచ్చాకా స్థిరమైన ప్రదర్శన కనబరుస్తున్న కేఎల్ రాహుల్ కు అదే కుడి తొడకు మరోసారి గాయం కావడం ఇబ్బంది కలిగించే అంశమని చెప్పొచ్చు.
ఇప్పటికే జడేజా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. తొలి టెస్టులో సింగిల్ తీసే క్రమంలో జడేజాకు తొడకండరాల గాయమైంది. ఇదే విషయాన్ని బీసీసీఐ పేర్కొంటూ.. జడేజా, కేఎల్ రాహుల్ లు ఫిబ్రవరి 2న విశాఖపట్నం వేదికగా మొదలయ్యే రెండో టెస్టుకు దూరమయ్యారు. బీసీసీఐ వైద్య బృందం వారి పురోగతిని పర్యవేక్షిస్తోంది. అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కోహ్లి కూడా వ్యక్తిగత కారణాల రిత్యా తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. ఇలా ఇద్దరు సీనియర్ బ్యాటర్లు దూరమైన నేపథ్యంలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఎడమచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లను రెండో టెస్టుకు ఎంపిక చేసింది. జాతీయ జట్టులో చోటుతో సర్ఫరాజ్ ఖాన్ నిరీక్షణ ఫలించినట్లయింది.
దేశవాలీ క్రికెట్ లో పరుగుల వరద పారించినప్పటికి సెలక్టర్ల నుంచి సర్ఫరాజ్ కు పిలుపు రాకపోవడం గతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే భారత జట్టులో చోటుకు సర్ఫరాజ్ పూర్తి అర్హుడే అయినా.. రెండో టెస్టుకు అతడికి తుది జట్టులో స్థానం లభించడం కష్టమే. ఇప్పటికే 15 మంది సభ్యుల జట్టులో ఉన్న పటీదార్ అరంగేట్రం చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్, భారత్ మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది.