‘సిమి’పై నిషేధం మరో ఐదేళ్లు పొడిగింపు

యూఏపీఏ కింద ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా పేర్కొంటూ  స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)పై నిషేధాన్ని మరో ఐదేళ్లపాటు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. 
ఉగ్రవాదాన్ని ఉపేక్షించకూడదన్న ప్రధాని మోదీ దృక్పథాన్ని బలపరుస్తూ యూఏపీఏ కింద ‘సిమి’ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడిందని తెలిపింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడతో పాటు శాంతి, మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉన్నట్లు తేలిందని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది.
 
స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)ని మొదటిసారిగా 2014 ఫిబ్రవరి 1వ తేదీన భారత ప్రభుత్వం నిషేధించింది. ఈ నిషేధాన్ని 2019లో మరో ఐదేళ్ల పాటు పొడిగించడం జరిగింది. 1977లో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో స్థాపించబడిన ఈ సంస్థ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే అజెండాలో పనిచేస్తుంది. 
 
2001లో మొదటిసారిగా సిమిని చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటిస్తూ నిషేధం విధించారు. అప్పటి నుంచి ఈ నిషేధాన్ని హోం మంత్రిత్వ శాఖ ఎనిమిదిసార్లు పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు తొమ్మిదోసారి కూడా నిషేధాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, 2014లో భోపాల్‌ జైల్‌ బ్రేక్‌, 2014లో బెంగళూరు పేలుళ్లు, 2017లో గయా పేలుళ్లతో సహా దేశంలో జరిగిన అనేక ఉగ్రదాడుల్లో సిమి సభ్యులు ఉన్నట్లు తేలింది.