సోరెన్‌ ఇంట్లో రూ.36 లక్షల నగదును స్వాధీనం

మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్‌ ముఖ్యమంత్రి  హేమంత్‌ సోరెన్‌ చుటూ ఈడీ ఉచ్చు బిగిస్తోంది.  ఆయన అధికారిక నివాసంలో సోమవారం జరిగిన సోదాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని సోరెన్‌ అధికారిక నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు అక్కడ సోదాలు చేపట్టారు. 
 
ఈ సోదాల్లో సోరెన్‌కు చెందిన రెండు బీఎండబ్ల్యూ కార్లు, కొన్ని నేరారోపణ పత్రాలు సహా రూ. 36 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూముల యాజమాన్యం మార్పు కుంభకోణంలో రూ.600 కోట్లు చేతులు మారినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సొరేన్‌కు ఈడీ అధికారులు ఏడు సార్లు సమన్లు జారీ చేశారు. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు.
 
ఈ నేపథ్యంలో సీఎం హేమంత్‌ సోరెన్‌ జార్ఖండ్‌ రాజధాని రాంచిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రులు, పాలకపక్షం ఎమ్మెల్యేలతో మంగళవారం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.
 
ఈ నెల 27 నుండి కనిపించడంలేదని చెబుతున్న ముఖ్యమంత్రి సొరేన్ మంగళవారం రోడ్ మార్గంలో రాంచీలోని తన అధికార నివాసంకు చేరుకున్నారు.
ఒకవేళ ఈడీ అధికారులు తనను అరెస్ట్‌ చేస్తే తన భార్య కల్పన నేతృత్వంలో కొత్త ప్రభుత్వాన్ని కొలువుదీర్చేందుకు ముందస్తు ప్రణాళిక రచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 
రాంచిలోని హేమంత్‌ సోరెన్‌ నివాసంలో ఈడీ అధికారులు ఆయనను బుధవారం విచారించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఈడీ అధికారులు సోరెన్‌కు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. కేసుకు పనికొచ్చే కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.