ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ గా అణు శాస్త్రవేత్త రజ్జుభాయ్

* జన్మదిన నివాళి
 
`రజ్జు భయ్యా’ అని అందరూ ప్రేమగా పిలుచుకునే  ప్రొ. రాజేంద్ర సింగ్ (29 జనవరి 1922 – 14 జూలై 2003) అణుశాస్త్రవేత్తగా పేరొంది, అలహాబాద్ యూనివర్సిటీలో విద్యాబోధన చేస్తూ, సామాజిక సమస్యల పరిష్కారంకోసం తన పూర్తి జీవితాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యక్రమాలకు అంకితం చేస్తూ, ఈ సంస్థ నాల్గవ సర్ సంఘచాలక్ గా పనిచేశారు.
 
అతను 1994 మరియు 2000 మధ్య సర్సంఘచాలక్. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర విభాగానికి ప్రొఫెసర్‌గా, అధిపతిగా పనిచేస్తూ  1960ల మధ్యలో తన జీవితాన్ని పూర్తిసమయం ఆర్ఎస్ఎస్ కోసం అంకితం చేసేందుకు ఉద్యోగం విడిచిపెట్టారు. రాజేంద్ర సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ నగరంలో 1922 జనవరి 29న జ్వాలా దేవి, బల్బీర్ సింగ్‌లకు జన్మించాచారు. 
 
తండ్రి అక్కడ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నిజానికి తండ్రి బల్బీర్ సింగ్ బులంద్‌షహర్ జిల్లాలోని బనైల్ పహాసు గ్రామానికి చెందినవారు. ఉన్నావ్ నుండి రజ్జు భయ్యా  మెట్రిక్యులేట్ చేశారు. ఆ తర్వాత నైనిటాల్‌లోని సెయింట్ జోసెఫ్ కాలేజీకి వెళ్లడానికి ముందు కొంతకాలం మోడరన్ స్కూల్ (న్యూ ఢిల్లీ)లో చేరారు.
 
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరి బిఎస్సి, ఎంఎస్సి డిగ్రీలు చేశారు. భౌతిక శాస్త్రవేత్, నోబెల్ బహుమతి గ్రహీత అయిన సర్ సి వి రామన్ ఎంఎసిలో తన ఎగ్జామినర్‌గా ఉన్నప్పుడు అసాధారణమైన తెలివైన విద్యార్థిగా గుర్తించబడ్డారు. న్యూక్లియర్ ఫిజిక్స్‌లో అధునాతన పరిశోధన కోసం ఆయన సింగ్‌కు ఫెలోషిప్ కూడా ఇచ్చారు.
 
అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చేరి చాలా సంవత్సరాలు విద్యాబోధన జరిపి, భౌతిక శాస్త్ర విభాగానికి అధిపతిగా నియమితులయ్యారు. ఆ రోజులలో భారతదేశంలో చాలా అరుదుగా కనిపించే  అణు భౌతిక శాస్త్రంలో రజ్జు భయ్యా నిపుణుడిగా కూడా పరిగణించబడ్డారు. సరళత, స్పష్టమైన భావనలను ఉపయోగించి సబ్జెక్టులో చాలా ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు.
 
అలాహాబాద్ యూనివర్సిటీలో డా. మురళీమనోహర్ జోషి షష్టిపూర్తి సందర్భంగా జరిగిన అభినందన సభలో మాట్లాడుతూ ‘నేను వందేళ్ల జీవితాన్ని ఆశీర్వదించను. అది ఫలించకపోవచ్చు. కానీ మీ జీవితంలోని ప్రతి సెకను ఇతరుల సేవలు కావచ్చు, దేశం కోవచ్చు ఫలవంతంగా ఉండాలని కొరొంటున్నాను’ అంటూ ఆయన చేసిన ప్రసంగం విలక్షణమైన ఆయన వ్యక్తిత్వాన్ని వెల్లడి చేస్తుంది. 
 
1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఆ సమయంలోనే ఆయనకు ఆర్ఎస్ఎస్ తో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి సంఘ్ ఆయన జీవితాన్ని ప్రభావితం చేసింది.1966లో తన యూనివర్సిటీ పదవికి రాజీనామా చేసి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ‘ప్రాంత్ ప్రచారక్’గా పూర్తికాల సేవలను అందించారు.  ఉత్తరప్రదేశ్‌లో ప్రారంభించి, సింగ్ 1980లలో సర్ కార్యవాహ (ప్రధాన కార్యదర్శి)గా ఎదిగారు.
 
1994లో, ఆయన బాలా సాహెబ్ దేవరాస్ తర్వాత ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నప్పుడు, మాజీ ప్రధానులు లాల్ బహదూర్ శాస్త్రి, చంద్ర శేఖర్, వి.పి. సింగ్ లతో పాటు మురళీ మనోహర్ జోషి వంటి ప్రముఖులు ఆయన విద్యార్థులే.
 
రజ్జూ భయ్యా సర్ సంఘచాలక్ గా ఉన్న ఆరు సంవత్సరాల కాలం సంఘ్ కె కాకుండా భారత దేశానికి కూడా అత్యంత కీలకమైనది. రజ్జు భయ్యా విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, మేధావులతో పాటు సైద్ధాంతిక రేఖలను దాటి రాజకీయ నాయకులతో అద్భుతమైన అనుబంధాన్ని ఏర్పర్చుకునేవారు. ఫిబ్రవరి 2000లో తన ఆరోగ్యం క్షీణించడంతో సర్ సంఘచాలక్ గా కె ఎస్ సుదర్శన్‌ని నియమించారు. 
 
ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతవాసంకు వెళ్లి భారతదేశం మొత్తం పర్యటించారు.  1976లో ఢిల్లీలో జస్టిస్ విఎం తార్కుండే అధ్యక్షతన జరిగిన మానవ హక్కుల సదస్సు నిర్వహణ బాధ్యతను కూడా వహించారు. ఫ్రెండ్స్ అఫ్ ఇండియా సొసైటీ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలక బాధ్యత వహించారు.
 
 “ప్రజలందరూ ప్రాథమికంగా మంచివారు. ప్రతి వ్యక్తి మంచితనాన్ని నమ్మి అతనితో వ్యవహరించాలి. కోపం, అసూయ మొదలైనవి అతని గత అనుభవాల నుండి వచ్చినవి. అవి అతని ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ప్రధానంగా ప్రతి వ్యక్తి మంచివాడు. ప్రతి ఒక్కరూ నమ్మదగినవారు.” అని ప్రగాఢంగా విశ్వసించేవారు.
 
రజ్జు భయ్యా  స్వదేశీ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే  భావనపై దృఢ విశ్వాసం కలిగి ఉండేవారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఆయన 1995లో గ్రామీణులను ఆకలి, వ్యాధులు లేని, విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రకటించారు.  ఆయన స్పూర్తితో నేడు స్వయంసేవకులు వందకు పైగా గ్రామాలలో అమలు పరుస్తున్న గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు పరిసర గ్రామాల ప్రజలను కూడా ప్రేరేపిస్తున్నాయి. ఆయన 14 జూలై 2003న మహారాష్ట్రలోని పూణేలోని కౌశిక్ ఆశ్రమంలో మరణించారు.