ప్రాచీన జ్ఞానంతో శాంతి యుగాన్ని తీసుకురావాలి

* అందరూ ఒకటి కాదు కానీ అంతా ఒక్కటే.. మోహన్ భగవత్ 
 
ప్రాచీన జ్ఞానంతో శాంతి యుగాన్ని తీసుకురావాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ పిలుపిచ్చారు. సరైన జ్ఞానంతో మనం కలిసికట్టుగా కలిసి పరిస్థితిని మార్చవచ్చని, సంఘర్షణలు,  పర్యావరణ విపత్తులు లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించవచ్చని తెలిపారు.
 
ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ కల్చరల్ స్టడీస్ (ఐసిసిఎస్) ఆధ్వర్యంలో “సుస్థిరమైన శ్రేయస్సును పంచుకోవడం” అనే అంశంపై ఐదురోజుల పాటు జరుగుతున్న పురాతన సంప్రదాయాలు, సంస్కృతుల ప్రముఖుల 8వ త్రై వార్షిక సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.  అస్సాంలోని  దిబ్రూఘర్‌లో ప్రఖ్యాత శిక్షా వ్యాలీ స్కూల్ ఆవరణలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన రివాచ్ సహకారంతో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అధ్యక్షత వహించారు.
 
మన ప్రాచీన సంస్కృతులు “అందరూ ఒకటి కాదు కానీ అంతా ఒక్కటే” అని గ్రహించాయని డా. భగవత్ తెలిపారు. మనం వివిధ రూపాలు, వ్యక్తీకరణలను కలిగి ఉన్నప్పటికీ ఈ వైవిధ్యాన్ని ప్రతికూలంగా చూడటంలో అర్థం లేదని స్పష్టం చేశారు. మనం వైవిధ్యాన్ని గౌరవించాలని చెబుతూ ఎందుకంటే అది వివిధ రూపాల్లో వ్యక్తీకరించబడిన ఏకత్వపు వ్యక్తీకరణ అని చెప్పారు. సంతోషం అనేడిది లోపాల ఉంటుంది గాని బైట ఉండెడిది కాదని గ్రహించమని తెలిపారు.
 
ప్రపంచంలో 2,000 సంవత్సరాల అభివృద్ధి, భౌతిక సంపద అనంతరం కూడా ఘర్షణలు చెలరేగుతున్నాయని, కానీ మనుషులలో శాంతి కనిపించటం లేదని డా. భగవత్ తెలిపారు. అనేక సిద్ధాంతాలు, ఇజాలు పుట్టుకొచ్చినా సమాజ ప్రాధాన్యతను గుర్తించని `వ్యక్తిగతావాదం’ నుండి సమాజాన్ని అత్యున్నతంగా భావించే `కమ్యూనిజం’ వరకు వ్యక్తిగత ఆనందం, సామాజిక` శాంతి కలిగించలేక పోతున్నాయని ఆయన చెప్పారు.
 
అన్ని సిద్ధాంతాలు భౌతిక శ్రేయస్సుపై దృష్టి సారించాయని, పరిష్కారాలను కనుగొనడానికి మతాలు ఉద్భవించినా అవి కూడా విఫలమయ్యాయని తెలిపారు. గరిష్టంగా వారు `గరిష్ట వ్యక్తులకు గరిష్ట మంచి’ ఆదర్శాన్ని చేరుకున్నారని అంటూ వారెవ్వరూ  సమగ్రతను చూడలేకపోవడమే అందుకు కారణం అని స్పష్టం చేశారు.ఈ మానవ కోణాల అన్నింటినీ అనుసంధానించే ఏకత్వపు అంతర్లీన మూలకాన్ని వారు గుర్తించలేకపోయారని చెప్పారు.
 
వారు “సర్వే సుఖినః సంతు” అనే మన ప్రాచీన జ్ఞానాన్ని చేరుకోలేకపోయారని చెప్పారు. ఉత్తమ ఫలితాలకు పోటీ పడటమే వారి ఆలోచన కావడంతో బలమైనవాడిదే రాజ్యం అన్నట్లు సాగుతున్నదని డా. భగవత్ తెలిపారు. భారతీయులు ధర్మం అని పిలిచే “ఆధ్యాత్మిక ఏకత్వం” అంతర్లీన అంశం పురాతన సంప్రదాయాలకు తెలుసని చెప్పారు.
 
ఒక వ్యక్తి, సంఘం లేదా సమాజం, దేశం, స్వభావం పరస్పరం  సంబంధం కలిగి ఉన్నాయని, ప్రతి ఒక్కటి తదుపరి యంత్రాంగానికి దారితీస్తుందని డా. భగవత్ పేర్కొన్నారు. అవి కేంద్రీకృత వృత్తాలలో ఉండవని, ఈ సంస్కృతి ద్వారా శాంతి, శ్రేయస్సు పొందవచ్చని తెలిపారు. 1951లో వేగవంతమైన ఆర్థిక పురోగతి కోసం పురాతన తత్వాలను రద్దు చేయడం, పాత సామాజిక సంస్థలను విచ్ఛిన్నం చేయడం గురించి ఐక్యరాజ్య సమితి తీర్మానం ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు. 
 
కానీ 2013లో, ప్రపంచ అభివృద్ధికి సంస్కృతిని అభివృద్ధి విధానాలలో ఏకీకృతం చేయడం అవసరమని ఐక్యరాజ్యసమితి అంగీకరించవలసి వచ్చిందని ఆయన తెలిపారు. వివిధ సంప్రదాయాలకు చెందిన మన ప్రాచీన జ్ఞాన వ్యవస్థలకు ఇది తెలుసు కాబట్టి ఇప్పుడు మన సమయం ఆసన్నమైనదని ఆయన స్పష్టం చేశారు.  
 
ప్రస్తుత అసహనం, కలహాలతో నలిగిపోతున్న ప్రపంచంలో, స్థానిక విశ్వాసాలు చాలా ఘోరంగా దెబ్బతిన్నాయని, వాటిని పెంపొందించడం మన కర్తవ్యమని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సూచించారు. ఈ విశ్వాస వ్యవస్థలు పర్యావరణానికి అనువుగా కట్టుబడి ఉన్నందున మనం వాటిని కాపాడుకోవాలని చెప్పారు.
 
ఎప్పటి నుంచో ప్రకృతితో మమేకమై జీవిస్తున్నారని పేర్కొంటూ ఆయన  అనేక అస్సామీ తెగలను,  ప్రకృతితో వారి అనుబంధాన్ని ప్రస్తావించారు. 
ఈ వర్గాలు ఇప్పుడు మతమార్పిడికి గురి అవుతున్నాయని ఆయన ఆందోళనవ్యక్తం చేశారు. అందుకు విద్య, ఆరోగ్య సంరక్షణలను ఎరగా ఉపయోగిస్తున్నారని చెప్పారు.