175 సీట్లు సాధిస్తామని జగన్ ధీమా

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో ఎన్నికల శంఖారావం పూరిస్తూ రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని, ఈ యుద్ధంలో వైసీపీ 175 సీట్లు సాధిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందని చెబుతూ ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వచ్చే ఎన్నికలకు ప్రతిపక్షాలు పద్మవ్యూహం పన్నుతున్నాయన్న జగన్ ఈ పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడ ఉంది అభిమన్యుడు కాదు అర్జునుడు అని స్పష్టం చేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడి లాంటి ప్రజలు తోడున్నారని పేర్కొంటూ వచ్చే ఎన్నికలు కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం లాంటిదని అభివర్ణించారు. వచ్చే యుద్ధంలో చంద్రబాబు సహా ప్రతిపక్షాలన్నీ ఓడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఏపీలో మరో 25 ఏళ్ల పాటు వైసీపీ జైత్ర యాత్రకు కొనసాగిస్తామని భరోసా వ్యక్తం చేశారు.
కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకూ ఏ గ్రామంలో చూసినా ఈ 56 నెలల కాలంలో చేసిన ఎన్నో గొప్ప మార్పులు కనిపిస్తాయని సీఎం జగన్ తెలిపారు. 540 కి పైగా పౌరసేవలను గడపగడపకు అందించే ఒక శాశ్వత వ్యవస్థను తీసుకొచ్చి, పేదరికం, అసమానతల సంకెళ్లను బద్దలు కొట్టి, ప్రతి పేద కుటుంబానికి మంచి చేస్తూ 21వ శతాబ్ద అభివృద్ధిలోకి పేదలందరినీ నడిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం అని వెల్లడించారు. 
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక దత్త పుత్రుడిని వెంట వేసుకుని తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. ఈసారి టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన 23 స్థానాలు కూడా రావని జోస్యం చెప్పారు. టీడీపీకి 175 స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా లేరని ఎద్దేవా చేశారు. 56 నెలల కాలంలోనే సంక్షేమం, అభివృద్ధి అంటే చేసి చూపించామని సీఎం జగన్ చెప్పారు.
 
రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్ మార్క్ పాలన కనిపిస్తుందని చెబుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే వైసీపీ అధికారంలో వచ్చిన 56 నెలల కాలంలో 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ఇన్ని ఉద్యోగాలు తెచ్చామని చెప్పే దమ్ము, ధైర్యం టీడీపీకి ఉందా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.