పరువు నష్టం కేసులో ట్రంప్‌కు భారీ జరిమానా

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మాజీ ప్రెసిడెంట్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు గట్టి షాక్‌ తగిలింది. ప్రముఖ రచయిత్రి జీన్‌ కారోల్‌ వేసిన పరువు నష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు ఆమెకు 83 మిలియన్‌ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ట్రంప్‌ తనను లైంగికంగా వేధించాడని కారోల్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 1990లో మాన్‌హటన్‌ అవెన్యూలోని బెర్గ్ డార్ఫ్ గుడ్ మాన్ డిపార్ట్ మెంట్ స్టోర్ డ్రెస్సింగ్ రూమ్‌లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని జీన్ కారోల్ ఆరోపించింది. 

2019లో ఓసారి తన గురించి అసభ్యకరంగా మాట్లాడి తన ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ పరువునష్టం దావా వేసింది. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన కోర్టు ట్రంప్‌నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 

ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్‌ డాలర్లతోపాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేందుకు మరో 65 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఫెడరల్‌ కోర్టు ఆదేశించింది. మొత్తం 83.3 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 83.3 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకుపైమాటే.

ఇక ఇదే కేసులో గతేడాది మేలో కూడా మరో కోర్టు ట్రంప్‌కు జరిమానా విధించిన విషయం తెలిసిందే. కారోల్‌ ఆరోపణలపై విచారణ జరిపిన న్యూయార్క్‌ జ్యూరీ ట్రంప్‌ను దోషిగా పేర్కొంది. కారోల్‌కు పరిహారం కింద 5 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.