శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.400 కోట్లకుపైగానే

శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.400 కోట్లకుపైగానే
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.300 నుంచి రూ.400 కోట్లకుపైగానే ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అంచనా వేశారు. 24 గంటలపాటు 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి, సుమారు 12 గంటల పాటు ఏసీబీ అధికారులు పలు కోణాల్లో విచారించినా శివబాలకృష్ణ నోరు విప్పలేదు. 
 
దీంతో నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా, ఫిబ్రవరి 8 వరకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ సందర్భంగా ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర కేసు వివరాలను వెల్లడించారు. శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారు, వజ్రాభరణాలు, సుమారు 6 కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. 
 
దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను కనుగొన్నట్టు వెల్లడించారు. సోదాల్లో దొరికిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారం రూ.8,26,48,999 అని, బయటి మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఏసీబీ రిమాండ్‌ కోసం తర్వలో పిటిషన్‌ వేయనున్నట్టు పేర్కొన్నారు.
 
 బాలకృష్ణ అక్రమాస్తులకు ఆజ్యంపోసిన ఈఐపీఎల్‌ లాంటి కొన్ని సంస్థలపై ఏబీసీ అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారోనని ఆందోళనలో పడ్డారు. ఈ సంస్థలకు చెందిన పలువురు బిల్డర్లు అంతా కలిసి పుప్పాలగూడలోని ఆదిత్య ఫోర్టులో విల్లా కొనుగోలు చేసి బాలకృష్ణకు గిఫ్ట్‌గా ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి. 
 
బాలకృష్ణ ఏ కంపెనీలకు, ఎవరెవరికి అనుమతులు ఇచ్చేందుకు ఎంతస్థాయిలో ముడుపులు తీసుకున్నారన్న విషయాలపై.. బంధువులు, మిత్రుల పేర్లతో పాటు 6 నెలలుగా ఫోన్ల సంభాషణలపై ఏసీబీ విచారణ ప్రారంభించినట్టు సమాచారం.  శివబాలకృష్ణకు బినామీల పేర్లతో లెక్కకు మించిన స్థిరాస్తులు ఉన్నట్టు ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీంద్ర తెలిపారు.
హైదరాబాద్‌లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాలకొద్దీ భూములు ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్‌ చుట్టుపకల ప్రాంతాల్లోనే దాదాపు 90 ఎకరాల ల్యాండ్‌ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మణికొండ, పుప్పాలగూడ పరిధిలోని మూడు నిర్మాణరంగ సంస్థల్లో పెట్టుబడులను పెట్టినట్టు వెల్లడించారు. త్వరలో ఆ సంస్థల్లోనూ దాడులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.