హనుమాన్ సినిమా దర్శకునికి ఆత్మీయ సత్కారం

తెలుగు నాట సూపర్ డూపర్ హిట్ అయిన `హనుమాన్’ సినిమా దర్శకులు ప్రశాంత్ వర్మ శ్రీ సరస్వతీ శిశుమందిర్ పూర్వ విద్యార్థులు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లోని శారదాధామంలో ప్రశాంతి వర్మకు శిశుమందిర్ పూర్వ విద్యార్థి  పరిషత్ ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. 

ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ శిశుమందిర్ లో తాను చదువుకొన్న రోజులను గుర్తు చేసుకున్నారు. జీవితంలో ఎదిగేందుకు అప్పట్లో తమకు నేర్పిన విలువలు, సంస్కారం ఎంతో ఉపయోగ పడ్డాయని ప్రశాంత్ వర్మ తెలిపారు. స్ఫూర్తిదాయకమైన హనుమాన్ కథ ను ఎంచుకొని సినిమాను తీసేందుకు కూడా అదే ఒరవడి కారణం అని ఆయన చెప్పారు. 

సినిమా విజయవంతమైన తర్వాత చాలా మంది నుంచి ఆహ్వానాలు వచ్చినప్పటికీ, పాఠశాలను దైవంగా భావిస్తున్నాను కాబట్టే ఇక్కడ నుంచి పిలుపు అందగానే వచ్చి పెద్దలు అందరినీ కలుసుకొన్నానని ఆయన పేర్కొన్నారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన విద్యా భారతి అఖిల భారతీయ ప్రచార ప్రభారీ లింగం సుధాకర్ రెడ్డి జీ మాట్లాడుతూ శిశుమందిర్ పూర్వ విద్యార్థులు  సమాజంలో వివిధ రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. సమాజ జీవితంలో సైతం విలువలతో, నిబద్దతతో కొనసాగుతున్నారని, ఇందుకు శిశుమందిర్ లలో అలవరచుకొన్న ప్రమాణాలే కారణం అని విశ్లేషించారు. 

ఈ కార్యక్రమంలో విద్యాపీఠం ప్రాంత సంఘటన మంత్రి పతకమూరి శ్రీనివాస్, పూర్వ విద్యార్థి పరిషత్ అధ్యక్షులు హరి స్మరణ్ రెడ్డి, కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు, క్షేత్ర శైక్షణిక్ ప్రముఖ్ రావుల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.