
* కేజ్రీవాల్ నోటి వెంట `రామరాజ్యం’
ఇప్పటికే కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు విషయంలో టిఎంసి, ఆప్ విముఖత వ్యక్తం చేస్తుండగా, మరోవంక కీలక నాయకులైన జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ల ధోరణులు `ఇండియా’ కూటమిలో కల్లోలం రేపుతున్నాయి. వారిద్దరూ కూటమికి దూరమవుతున్నారని సంకేతాలు వెలువడుతున్నాయి.
ప్రముఖ ఓబిసి నాయకుడు, మాజీ బీహార్ ముఖ్యమంత్రి కర్పూర ఠాకూర్ కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయున్నత పౌర పురస్కారం `భారత రత్న’ ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించిన నితీష్ కుమార్ `కుటుంభం రాజకీయం’ గురించి ప్రస్తావించడం ద్వారా బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి దగ్గరవుతున్నారనే కథనాలకు ఆస్కారం కలిగిస్తున్నారు.
వచ్చే నెల 4న బీహార్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్న బహిరంగసభలో నితీష్ కుమార్ కూడా పాల్గొనవచ్చని కధనాలు వెలువడుతున్నాయి. మొన్నటి వరకు తిరిగి నితీష్ ను ఎన్డీయేలో చేర్చుకొని ప్రసక్తి లేదని చెబుతూ వస్తున్న హోంమంత్రి అమిత్ షా ఇటీవల మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ ఎన్డీయేలో ఎవరైనా చేరాలి అనుకొంటే పరిశీలిస్తామని చెప్పడం గమనార్హం.
పాట్నాలో తమ పార్టీ ఎమ్మెల్యేలందరితో సమావేశమైన నితీష్ తాను తొలుత రాజీనామా చేసి ఆపై బీజేపీ, జితన్ రాం మాంఝీ. ఇతరుల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని చెప్పినట్టు కధనాలు వెలువడుతున్నాయి. నూతన క్యాబినెట్ ఏర్పాటు చేసిన అనంతరం అసెంబ్లీ రద్దు చేసి ప్రజా తీర్పుకు వెళతానని స్పష్టం చేసినట్టు చెబుతున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానం అందినా నితీష్ కుమార్ స్పందించకపోవడం కూడా ఆయన తిరిగి ఎన్డీయే కూటమికి చేరువవుతున్నారనే వార్తలకు బలం చేకూరుతోంది. `ఇండియా’ కూటమి లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరు, ప్రధాని అభ్యర్ధిత్వంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంపైనా నితీష్ అసంతృప్తితో ఉన్నారని జేడీయూ వర్గాలు పేర్కొన్నాయి.
మరోవంక, కేజ్రీవాల్ తన పాలనను రామరాజ్యంతో పోల్చుతూ రామరాజ్యంలో మాదిరిగా మంచి ఆరోగ్యం, విద్య, ఉచిత నీటి సరఫరాను అందిస్తున్నామని తెలిపారు. అయోధ్యలోని రామమందిరంలో జరిగే ప్రతిష్ఠాపన కార్యక్రమం దేశానికి, ప్రపంచానికి గర్వకారణమని కూడా పేర్కొనడం గమనార్హం.
ఢిల్లీ ప్రభుత్వం ఛత్రసాల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలో కేజ్రీవాల్ మాట్లాడుతూ అయితే, రాముడు ఎప్పుడూ కులం, మతం ఆధారంగా వివక్ష చూపలేదని స్పష్టం చేశారు. రామరాజ్యంలో అందరూ తమ మతాన్ని పాటించేవారని చెబుతూ రామయణంలోని రామరాజ్యానికి నిర్వచనంలా ఢిల్లీ నగరాన్ని పాలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
రామరాజ్యం స్ఫూర్తితో ఢిల్లీని పాలిస్తున్నామని పేర్కొంటూ రామరాజ్యం అంటే ఆనందం, శాంతి పాలన అని చెప్పారు. రామరాజ్యం మాదిరిగానే తమ ప్రభుత్వం వృద్ధులను గౌరవిస్తోందని, వారి పెన్షన్‌ను పెంచడంతోపాటు వారికి ఉచితంగా తీర్థయాత్రలు ఏర్పాటు చేస్తున్నామని కేజ్రీవాల్ తెలిపారు. ఇప్పటి వరకు 83వేల మందికిపైగా వృద్ధులను తీర్థయాత్రలకు పంపామని చెబుతూ రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ అనంతరం అయోధ్య యాత్ర ప్రారంభించాలని చాలా అభ్యర్థనలు వచ్చాయని, త్వరలోనే వీలైనంత మందిని అక్కడికి తీసుకెళ్తామని ప్రకటించారు.
అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన జరగడం దేశానికి, ప్రపంచానికి గర్వకారణమని కేజ్రీవాల్ కొనియాడుతూ రాముడి జీవిత సూత్రాలను ప్రజలు తమ జీవితాల్లో తప్పనిసరిగా స్వీకరించాలని ఆయన కోరారు. అయితే, రామరాజ్యం గురించి బీజేపీ చేస్తున్న ప్రకటనలపై కేజ్రీవాల్ కప్పదాటు వైఖరి అనుసరిస్తూ, “గత 75 ఏళ్లలో, ధనికులు మరింత ధనవంతులుగా మారారు, పేదలు పేదలుగా మారారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం అనేది మనం అనుసరిస్తున్న ‘రామరాజ్యం’ భావనలో భాగం” అంటూ చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వ నివేదికల ప్రకారమే ఢిల్లీలో ద్రవ్యోల్భణం పెరిగిందని చెబుతూ ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఇది రామరాజ్యమని మేము చెప్పలేమని స్పష్టం చేసారు. దేశంలోని పేదలందరికీ ఆర్థిక ప్రయోజనం చేరినప్పుడే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండానే లక్ష్యం మంచిదని ఆయన పేర్కొన్నారు.
మరోవంక, నితీష్ కుమార్ గురువారం `కుటుంభం రాజకీయాల’పై విమర్శలు గుపించి కలకలంరేపారు. రాజకీయాల్లో తన కుటుంబంలోని వ్యక్తులను ప్రోత్సహించడానికి తాను ఎప్పుడూ ప్రయత్నించలేదని గుర్తు చేశారు. తన సిద్ధాంతకర్త, గురువు కర్పూరి ఠాకూర్ 100వ జన్మదినోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమంలో కుమార్ ఇలా అన్నారు:
“ఇతర విషయాలతోపాటు, కర్పూరి ఠాకూర్ తన కుటుంబాన్ని ప్రోత్సహించడానికి ఎన్నడూ ప్రయత్నించలేదని గుర్తుంచుకోవాలి. మన కాలంలోని చాలా మంది నాయకుల నుండి గుర్తించదగిన వైరుధ్యం.” అంటూ పరోక్షంగా మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ `కుటుంభ రాజకీయాల’పై విసుర్లు వివిసిరారు.
బీహార్ మాజీ సిఎం కర్పూరీ ఠాకూర్ కు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం భారతరత్న ప్రకటించడం పట్ల హర్షం ప్రకటిస్తూ గతంలో యుపిఎ ప్రభుత్వంలో తాను ఈ విషయమై ఎన్నిసార్లు కోరినా స్పందించలేదంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని సహితం పలుమార్లు కోరానని చెప్పారు.
ఈ క్రమంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య.. సీఎం నితీశ్ కుమార్ లక్ష్యంగా చేసిన ట్వీట్లు ఒక్కసారిగా బిహార్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. బిహార్‌లో అధికారం దక్కించుకునేందుకు అసెంబ్లీలో మెజారిటీ మార్కును దాటేందుకు ఎమ్మెల్యేల సంఖ్యపై లాలూ ప్రసాద్ యాదవ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్జేడీకి 122 మంది ఎమ్మెల్యేలు అవసరంగా కాగా.. ప్రస్తుతం 114 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఇక మిగిలిన 8 మందిని తమవైపు తిప్పుకునేందుకు ఆర్జేడీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే బిహార్ మాజీ సీఎం జీతన్ రామ్ మాంఝీ వర్గంలోని నలుగురు ఎమ్మెల్యేలు, ఎంఐఎం నుంచి ఒకరు, మరొక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయినప్పటికీ అధికారం దక్కాలంటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అవసరం కానుంది.
ఇవన్నీ జరుగుతుండగానే.. సీఎం నితీష్ కుమార్ బిహార్ అసెంబ్లీని రద్దు చేసే యోచనలో ఉన్నట్లు మరో వాదన తెరపైకి వస్తోంది. ఇప్పుడు అసెంబ్లీని రద్దు చేసి.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జేడీయూ పోటీ చేయవచ్చని సమాచారం. ఇక బిహార్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలను నిశితంగా పరిశీలిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్ర నేతలను ఢిల్లీకి రప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి, కేంద్రమంత్రి అశ్విని చౌబే హుటాహుటిన పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరారు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
More Stories
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు