తమిళనాడు ప్రభుత్వంకే జయలలిత ఆభరణాలు

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో స్వాధీనం చేసుకున్న కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు కర్నాటక ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది. అలాగే, ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు చేసిన ఖర్చులకు తమిళనాడు ప్రభుత్వం కర్ణాటకకు రూ.5 కోట్లు పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

జయలలితపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలో జరిపారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ప్రస్తుతం కోర్టు కస్టడీలో కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయని తెలిపారు. జయలలిత ఆభరణాలను వేలం వేసి, ఆ వచ్చిన మొత్తంలో నుంచి అక్రమాస్తుల కేసు విచారణకు కర్ణాటక చేసిన ఖర్చును కర్ణాటక ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త టి.నరసింహమూర్తి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

అయితే, జయలలిత ఆభరణాలను వేలం వేయాలన్న పిటిషనర్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. స్వాధీనం చేసుకున్న ఈ విలువైన ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి ఇవ్వాలని ఆదేశించింది. ఆభరణాలను వేలం వేయడానికి బదులుగా తమిళనాడు రాష్ట్రానికి ఇవ్వడం సబబని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 

కేంద్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులపై జయలలిత కుటుంబానికి హక్కు లేదని గతంలో కోర్టు తేల్చిచెప్పింది. జయలలిత మేనకోడలు, మేనల్లుడు జె.దీప, జె.దీపక్ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014 సెప్టెంబర్ 27న బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించింది. జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న విలువైన వస్తువులను బహిరంగ వేలం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి విక్రయించాలని ఆదేశించింది. వచ్చిన మొత్తాన్ని జరిమానా మొత్తానికి సర్దుబాటు చేయాలని ఆదేశించింది.