‘బాలక్‌ రామ్‌’గా అయోధ్య రామయ్య దర్శనం

 
* తొలి రోజు 5 లక్షలకు మందికి పైగా దర్శనం
 
అయోధ్యలో కొలువుదీరిన రామ్‌లల్లా విగ్రహాన్ని ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నారు. బాల రాముడి విగ్రహానికి 22న ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఐదేళ్ల బాలుడిగా రాముడు దర్శనమిస్తున్న నేపథ్యంలో ‘బాలక్‌ రామ్‌’గా పిలువనున్నట్లు పూజారి అరుణ్ దీక్షిత్ వెల్లడించారు. ఆయన కొలువైన మందిరాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని తెలిపారు.
 
 ప్రతిష్ఠాపన సమయంలో బాల రాముడి విగ్రహాన్ని తొలిసారి చూసిన సమయంలో తాను పులకించిపోయానని, ఆ సమయంలో కనుల నుంచి నీళ్లు వచ్చాయని చెబుతూ ఆ అనుభూతిని తాను వివరించలేనని తెలిపారు. జనవరి 18న తాను తొలిసారి రామయ్య (బాలక్ రామ్) విగ్రహాన్ని చూసినట్టు చెప్పారు.
 
”తొలిసారి నేను విగ్రహం చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. కళ్ల నుంచి ఆనందభాష్పాలు రాలాయి. అప్పటి నా అనుభూతిని మాటల్లో చెప్పలేను” అని ఇంతవరకు తన జీవిత కాలంలో 50 నుంచి 60 ప్రాణప్రతిష్ఠ  కార్యక్రమాలను నిర్వహించిన వారణాసి పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు.  
 
ఇప్పటి వరకు తాను నిర్వహించిన విగ్రహ ప్రాణప్రతిష్టల్లో ఈ విగ్రహం అత్యంత అలౌకికమైన, అత్యున్నతమైనదిగా తనకు అనిపించిందని చెప్పారు.  కాగా, మంగళవారం నుంచి శ్రీరాముడి దర్శనానికి సాధారణ భక్తులకు అనుమతించిన నేపథ్యంలో భవ్యమైన రామ మందిరంలో దివ్యమైన అవతారంలో కొలువుదీరిన శ్రీరాముడిని చూసేందుకు భక్తులు రామాలయానికి పోటెత్తారు. 
 
భక్తులు భారీగా పోటెత్తడంతో అధికారులు రద్దీని నియంత్రించేందుకు ఏకంగా 8 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించాల్సి వచ్చింది. ఈ రోజు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.  మొత్తం మీద 5 లక్షలకు మందికి పైగా భక్తులు రామ్‌ లల్లాను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారిని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆలయం వద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. కొంత మంది భక్తులు పోలీసు లైన్లను కూడా దాటుకొంటూ వెళ్లారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయం వద్ద తోపులాట జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి దాదాపు 2.5 లక్షల మంది ఆలయానికి వచ్చారని అయోధ్య డివిజనల్‌ కమిషనర్‌ గౌరవ్‌ దయాల్‌ పేర్కొన్నారు.
 
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా డిజిపి ప్రశాంత్ కుమార్ తో కలిసి హెలికాప్టర్ ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించి అధికారులకు తగు సూచనలు చేశారు.  భక్తుల రద్దీని నియంత్రించేందుకు అయోధ్యలో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ‘‘రద్దీ నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశాం. భక్తులు వేచి చూసేందుకు ఓ ప్రాంతం సిద్ధం చేశాం. అక్కడి నుంచి క్రమపద్ధతిలో భక్తులను ఆలయంలోకి అనుమతిస్తున్నాం’’ అని అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ మీడియాకు తెలిపారు. 
 
రద్దీ నిర్వహణ కోసం యూపీ స్పెషల్ ఫోర్సెస్‌కు, ఇతర భద్రతా సిబ్బందికీ ప్రత్యేక సూచనలు చేశామని అయోధ్య ఐజీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ‘‘మా బాధ్యత క్రౌడ్ మేనేజ్‌మెంట్ అయినప్పటికీ పోలీసింగ్ విధులు కూడా ఉన్నాయి. అయితే, భక్తులతో కటువుగా ఉండొద్దని సిబ్బందికి సూచనలు ఇచ్చాము. భక్తుల సౌకర్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’’ అని ప్రవీణ్ కుమార్ తెలిపారు.