టి20 ఐసీసీ కెప్టెన్ గా సూర్యకుమార్

2023 ఏడాదికి సంబంధించి ఐసీసీ.. పురుషుల, మహిళల ఉత్తమ టి20 ఎలెవెన్ జట్టును ప్రకటించింది. ఐసీసీ పురుషుల ఉత్తమ జట్టుకు భారత స్టార్ సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీకీ ఎంపిక చేయగా.. మహిళల జట్టుకు శ్రీలంక స్టార్ చమేరీ ఆటపట్టును ఎంపిక చేసింది. కాగా ఐసీసీ ఎంపిక చేసిన పురుషుల ఉత్తమ టి20 జట్టులో సూర్యతో పాటు మరో ముగ్గురికి చోటు దక్కడం విశేషం. యంగ్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్, స్పిన్ బౌలర్ రవి బిష్ణోయి, పేసర్ అర్షదీప్ సింగ్ లకు చోటు దక్కింది. గతేడాది సూర్యకుమార్ టి20ల్లో మూడో టాప్ స్కోరర్ గా నిలిచాడు. 48.86 సగటుతో 733 పరుగులు చేశాడు.
ఇక యశస్వి జైశ్వాల్ ఆసియా గేమ్స్ లో భాగంగా నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 49 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించడం.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలతో జరిగిన టి20 సిరీస్ ల్లోనూ మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. ఇక బౌలర్లుగా అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయి లు తమ ప్రదర్శనతో భారత్ సిరీస్ లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇక మిగతావారిలో వెస్టిండీస్ నుంచి నికోలస్ పూరన్, మార్క్ చాప్ మన్.. ఇంగ్లండ్ నుంచి ఫిలిప్ సాల్ట్, ఇక ఆల్ రౌండర్ విభాగంలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా చోటు దక్కించుకున్నాడు. వీరితో పాటు మార్క్ అడైర్, రిచర్డ్ నగరవా, అల్పేష్ రమ్ జానీ లు ఎంపికయ్యారు. ఏడాది వ్యవధిలో నిలకడగా ఆడిన 11 మందిని ఐసీసీ వార్షిక ఉత్తమ జట్టుకు ఎంపిక చేస్తుంది.
ఇక మహిళల జట్టులో భారత్ నుంచి ఆల్ రౌండర్ దీప్తి శర్మ మాత్రమే చోటు దక్కించుకుంది. కెప్టెన్ గా చమేరీ ఆటపట్టు, కీపర్ గా బెత్ మూనీని ఎంపిక చేసింది. మొత్తంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి ఐసీసీ ఉత్తమ టి20 జట్టులో సత్తా చాటింది. నలుగురు ఆసీస్ మహిళా ప్లేయర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బెత్ మూనీతో పాటు ఎలీస్ పెర్రీ, మేఘన్ స్కాట్, అష్లీ గార్డనర్ లు ఉన్నారు. ఇక న్యూజిలాండ్ నుంచి అమిలీయా కెర్, ఇంగ్లండ్ నుంచి నట్ సివర్ బ్రంట్ సహా తదితరులు ఉన్నారు.
ఐసీసీ పురుషుల టి20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: యశస్వి జైస్వాల్, ఫిల్ సాల్ట్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సికందర్ రజా, మార్క్ చాప్‌మన్, అల్పేష్ రంజానీ, మార్క్ అడైర్, రవి బిష్ణోయ్, రిచర్డ్ నగరవ, అర్ష్‌దీప్ సింగ్.
ఐసీసీ మహిళల టి20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2023: చమరి ఆటపట్టు(కెప్టెన్), లారా వోల్వార్డ్ట్, బెత్ మూనీ(వికెట్ కీపర్),హేలీ మాథ్యూస్, నాట్ స్కివర్-బ్రంట్, అమేలియా కెర్, ఎల్లీస్ పెర్రీ, ఆష్లీగ్ గార్డనర్, దీప్తి స్చులెస్‌టోన్, సోఫీ ఎక్చులెస్.