వైసిపి ప్రభుత్వ చేత కాని తనంతో కుంటుపడిన అభివృద్ధి

వైసీపీ ప్రభుత్వ చేత కాని తనం వల్ల రాష్ర్టంలో అభివృద్ధి కుంటూ పడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురేందరేశ్వరి విమర్శించారు. ఆదివారం నంద్యాలలో శక్తి కేంద్ర ప్రముఖులు, పోలింగ్ బూత్ అధ్యక్షుల సమావేశం సందర్భంగా మాట్లాడుతూ అమె టిడిపి, వైసిపి ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు.

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అభివృధిపై దృష్టి పెట్టి ప్రపంచ దేశాలు మనవైపు చూసే విధంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేశారని ఆమె చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి బిజెపి కట్టు బడి ఉందని పేర్కొంటూ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని ధ్వజమెత్తారు.

వైసిపి ప్రభుత్వం `ఆడుకుందాం రా’ అంటూ ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందనీ ఆమె ధ్వజమెత్తారు. టిడిపి, వైసిపి ప్రభుత్వాలు తమ స్టిక్కర్లు వేసుకొని కేంద్రం పదకాలు హైజాక్ చేశాయని ఆమె ఆరోపించారు. ఓర్వకల్లు విమానాశ్రయం ఏర్పాటుకు బిజేపి నిధులు ఇచ్చిన విషయంను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.

అయోధ్యలో బలరాముడు విగ్రహ ప్రతిష్టకు అన్ని రాష్ట్రాలు సెలవు ప్రకటిస్తే ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించకపోవడం పట్ల ఆమె విచారం వ్యక్తం చేశారు. అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణం దశాబ్దాల కల సాకారమైందని చెబుతూ విగ్రహ ప్రతిష్ట అందరూ తిలకించాలని ఆమె కోరారు. శ్రీశైలంలో శివయ్యను దర్శించుకొని రాముని విగ్రహ ప్రతిష్ట లైవ్ లో తిలకిస్తానని ఆమె చెప్పారు.

కాగా, రాష్ట్రంలో బిజేపి, జన సేన పొత్తు కొనసాగుతుందని పురందేశ్వరి స్పష్టం చేశారు. అయితే, తెలుగుదేశంతో పొత్తు అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. బిజేపి ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి చేసిందని అభియోగం మోపుతున్నారని, కానీ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ అధికారులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుందో చెప్పిన విషయం ఆమె గుర్తుచేశారు. 

ఓటరు లిస్ట్ అవకతవకలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాశామని చెబుతూ తిరుపతి ఉపఎన్నికలో వైసిపి నాయకులు 35 వేల దొంగ ఓట్లు వేయించుకున్నారని, ఆ సంఘటనలో ఒక ఐఎఎస్ అధికారి సస్పెండ్ అయిన విషయాన్ని ఆమె  గుర్తు చేశారు. వైసిపి నాయకులతో కుమ్మక్కై అధికారులతో పాటు కారణమైన వైసిపి నాయకులపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘమును కోరామని ఆమె వెల్లడించారు.

శ్రీశైలం అభివృద్ధికి రూ.43 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఆమె తెలిపారు. ప్రజలు బిజెపి నీ ఆదరిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పయనిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.