ఏపీని అప్పులమయం చేసిన జగన్, చంద్రబాబు

గత పదేళ్లుగా విభజిత ఆంధ్ర ప్రదేశ్ ను పాలిస్తూ వచ్చిన చంద్రబాబు నాయుడు, వై ఎస్ జగన్ మోహన్ నాయుడులు రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. ఈ పదేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా? అంటే దానికి సమాధానం లేదన్నారు. చంద్రబాబు హయాంలో రూ.2 లక్షల కోట్లు అప్పులు చేస్తే వైసీపీ హయాంలో సీఎం జగన్ చేసిన అప్పులు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అని విమర్శించారు.

“రాష్ట్రంలో పది లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై ఉంది. ఇన్ని అప్పులతో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంలేదు. రాజధాని లేదు, దానిని కట్టడానికి డబ్బులు లేవు. ఒక్క మెట్రో రైలు లేదు. పదేళ్లలో పది పెద్ద పరిశ్రమలు కూడా రాలేదు. విజయవాడలో కూడా మెట్రో లేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు కూడా లేవు” అంటూ ఆమె విమర్శించారు.

అభివృద్ధి లేదు కానీ దళితుల మీద దాడులు పెరిగాయని, ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియా మాత్రమే ఉన్నాయని ఆమె మండిపడ్డారు. ఏపీలో దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే ఉందంటూ తన సోదరుడి పాలనంపై నిప్పులు చెరిగారు.

ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు, జగనే కారణం అని వైఎస్ షర్మిల విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని 3డీ గ్రాఫిక్స్ చూపించారని, జగన్ మూడు రాజధానులు అని ఒకటి కూడా అవ్వలేదని ఆమె విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ 2004లో వైఎస్ఆర్ ప్రారంభించారని, వైఎస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాల్వల నిర్మాణం పూర్తి చేశారని గుర్తుచేశారు.

ఆయన చనిపోయాక ఈ ప్రాజెక్టు ఒక్క ముందుకు వెళ్లలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్ బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారని ఆమె ఆరోపించారు. పదేళ్లలో ఏపీలో లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.టీడీపీ, వైసీపీకి చెందిన 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ఆమె నిలదీశారు. 25 మంది ఎంపీలు బీజేపీ చేతుల్లో ఉన్నారని, బీజేపీ చెబితే గంగిరెద్దులా తల ఊపుతున్నారని విమర్శించారు.