అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవు 

అయోధ్యలో ఇకపై కర్ఫ్యూలు, కాల్పులు ఉండవని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భరోసా వ్యక్తం చేశారు. రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ప్రసంగించిన ఆయన నాటి ములాయం సింగ్‌ యాదవ్‌ ప్రభుత్వంపై పరోక్షంగా మండిపడ్డారు.  ‘ఇకపై అయోధ్య ప్రక్రియకు ఎవరూ అడ్డంకిగా మారరు. అయోధ్య వీధులు బుల్లెట్ల మోతతో ప్రతిధ్వనించవు. కర్ఫ్యూ ఉండదు. ఇప్పుడు దీపోత్సవం, రామోత్సవాలు జరుగుతాయి. రామకీర్తనలు ప్రతిధ్వనిస్తాయి. ఈ రోజు ఇక్కడ జరిగిన రామ్ లల్లా ప్రతిష్ఠాపన రామరాజ్యం స్థాపనను సూచిస్తుంది’ అని సంతోషంగా ప్రకటించారు.

తమ దేవుణ్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు మెజారిటీ మతస్థులు ఇన్నేళ్లుగా పోరాటం జరపడం చరిత్రలో ఇదే మొదటిసారని చెబుతూ  బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడంతో యావత్ భారతదేశమే అయోధ్యధామంగా మారిందని చెప్పారు. ఎక్కడైతే రామ మందిరం నిర్మించాలని నిర్ణయించుకొన్నామో అక్కడే ఇప్పుడు అనేక పోరాటాల అనంతరం నిర్మించుకో గలిగామని తెలిపారు.

“ఒక దేశంలోని మెజారిటీ కమ్యూనిటీ తమ ఆరాధ్యదైవానికి ఆలయాన్ని నిర్మించుకోవడానికి అనేక స్థాయిల్లో చాలా కాలం పాటు పోరాడవలసి వచ్చినప్పుడు శ్రీ రామ జన్మభూమి ప్రపంచంలోనే ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. రామమందిరం నిర్మించాలని సంకల్పించిన చోటే నిర్మించడం పట్ల ఆత్మ సంతోషిస్తోంది. మన నిబద్ధతను పూర్తి చేసినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’ అని యోగి భావోద్వేగంతో చెప్పారు.

కాగా, 1990లో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం హయాంలో అయోధ్యలో ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో కరసేవకులపై జరిగిన పోలీస్‌ కాల్పుల్లో 17 మంది కరసేవకులు అధికారికంగా  మృతిచెందగా,మరి అనేక మంది కూడా వీరమరణం పొందారు.  ఆ తర్వాత కరసేవ సమయంలో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం కరసేవకులపై కాల్పులు ఎట్టి పరిస్థితులలో జరపరాదని ఆదేశాలు ఇవ్వడం, ఆ సమయంలోనే బాబరీ కట్టడం నేలకూలడం చారిత్రక పరిణామం. ఆ కట్టడం నేలకూలిన కారణంగానే నేడు భవ్యమైన మందిర నిర్మాణం అక్కడ సాధ్యమయింది.

యోగి ఆదిత్యనాథ్‌ తన ప్రసంగంలో పరోక్షంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు. రామ మందిరం కోసం ఎంతో మంది తమ జీవితాలను త్యాగం చేశారని కొనియాడారు. మరోవైపు రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఏకైక ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కావడం విశేషం. అలాగే ప్రధాని మోదీతో కలిసి గర్భగుడిలో జరిగిన పూజా క్రతువుల్లో కూడా ఆయన పాల్గొన్నారు.