అందంగా ముస్తాబైన భాగ్యనగరం, ఎక్కడ చూసినా రామనామ స్మరణే

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట  మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భాగ్యనగర వాసులు సిద్ధమవుతున్నారు. భాగ్యనగరం మొత్తం శ్రీరామ నామస్మరణతో మార్మోగిపోతుంది. నగరంలోని అన్ని ఆలయాలను అందంగా అలంకరించారు. చిలుకురూ బాలాజీ టెంపుల్ వద్ద ప్రత్యేక ప్రదర్శనల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

తాడ్ బండ్, కర్మాన్ ఘాట్, సీతాఫల్ మండి తదితర ప్రాంతాల్లోని ఆంజనేయ స్వామి ఆలయాలు, శ్రీరాముడి మందిరాలను, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, హిమాయత్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాలను అందంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. నగరంలో అడుగడుగునా ఆధ్మాత్మికత, భక్తిభావం ఉట్టిపడేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీధుల్లో, ప్రధాన కూడళ్లలో కాషాయ జెండాలతో తోరాణాలు కట్టారు.

మరోవైపు శ్రీరాముడి నిలువెత్తు భారీ కటౌట్ లు ప్రత్యేక ఆకర్షణలుగా మారాయి. విశ్వహిందూ పరిషత్, భజరంగదళ్ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.  విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు నగరంలో పలుచోట్ల భారీస్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని నినదిస్తూ వేడుకల్లో పాల్గొనేలా ఇంటింటికీ కాషాయ జెండాల పంపిణీ చేపట్టారు.

సాయంత్రం ఆలయాలు, కమ్మూనిటీహాళ్లు తదితర ప్రాంతాల్లో భక్తి కార్యక్రమాలను, భజనలను ఏర్పాటు చేయనున్నారు. ఉస్మాన్ గంజ్, కోఠి, బేగంబజార్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వివిధ సంస్థల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.  ఇక నివాసిత సంఘాలు, గేటెడ్ కమ్యూనిటీలు, లగ్జరీ అపార్ట్ మెంట్ అసోసియేషన్లు శ్రీరామ నామాన్ని జపిస్తున్నాయి.

సైబర్ కమ్యూనిటీ, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, నానక్ రాంగూడ, కొండాపూర్ లోని బహుళ అంతస్తుల అపార్ట్ మెంట్లలో, టవర్స్ లో శ్రీరామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నగరం నలమూలలా రథయాత్రలు, అన్నదానం, రామ భజనలు, విష్ణు సహస్రనామాలు వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాట్లు చేశారు. మొత్తం అయోధ్యలో ప్రతిష్టాత్మక బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా భాగ్యనగరం మొత్తం రామనామ స్మరణతో మార్మోగిపోతోంది.