విడిపోయిన షోయబ్, సానియా మీర్జా జంట

గతంలో భారత టెన్నిస్ క్రీడాకారిణి, హైదరాబాద్ కు చెందిన సానియా మీర్జాను వివాహం చేసుకున్న పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మరో వివాహం చేసుకున్నారు. పాకిస్తాన్ కు చెందిన నటి, మోడల్ సనా  జావేద్ ను షోయబ్ పెళ్లి చేసుకున్నారు.  షోయబ్, సానియా కొంతకాలంగా రెండేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.

షోయబ్, సానియాలు విడాకులు తీసుకున్నట్లు ఆమె తండ్రి   ఇమ్రాన్ మిర్జా తెలిపారు. ‘ఖులా’ ప‌ద్ధ‌తి ప్ర‌కారం సానియా.. మాలిక్‌కు విడాకులు ఇచ్చింద‌ని ఇమ్రాన్ తెలిపాడు. ‘ష‌రియా చ‌ట్టంలో పేర్కొన్న‌ ఖ‌లా అనేది ముస్లిం మ‌హిళ‌లకు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చే స్వేచ్ఛ‌ను ఇస్తోంది. నా బిడ్డ సానియా కూడా ఖులా ప్ర‌కారం షోయ‌బ్‌కు విడాకులు ఇచ్చింది’ అని ఇమ్రాన్ వెల్ల‌డించాడు.

షోయబ్ మాలిక్‌, సానియా మిర్జాలు 2010లో హైద‌రాబాద్‌లో ఘ‌నంగా పెండ్లి చేసుకున్నారు. అనంత‌రం పాకిస్థాన్‌లోని సియాల్ కోట్‌లో వ‌లీమా వేడుక జ‌రిగింది. కొన్నాళ్లు దుబాయ్‌లో గడిపిన ఈ జంట‌కు ఇజాన్ అనే కుమారుడు పుట్టాడు. ప్ర‌స్తుతం ఇజాన్‌కు నాలుగేండ్లు. అయితే, గ‌త కొంత కాలంగా సానియా, షోయ‌బ్ వేరువేరుగా ఉండ‌డంతో వీళ్ల ప‌న్నెండేళ్ల వివాహబంధం త్వ‌ర‌లోనే ముగియ‌నుంద‌నే వార్త‌లు వినిపించాయి.

సానియా కంటే ముందు మాలిక్ హైద‌రాబాద్‌కే చెందిన‌ అయేషా సిద్దిఖీని 2002లో పెండ్లి చేసుకున్నాడు. అయితే 2010లో అయేషాతో వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికి సానియాను మ‌నువాడాడు. ఇప్పుడు షోయ‌బ్ పెండ్లి చేసుకున్న‌ స‌నా ఒక‌ ఉర్దూ టీవీ సీరియ‌ల్ న‌టి. 2012లో బుల్లితెర‌పై ఎంట్రీ ఇచ్చింది.  స‌నాకు ఇది రెండో పెండ్లి. మొద‌ట ఆమె పాక్ న‌టుడు, సింగ‌ర్ ఉమ‌ర్ జ‌స్వాల్‌ను 2020లో పెండ్లి చేసుకుంది. అయితే.. మ‌న‌స్ఫ‌ర్థ‌ల కార‌ణంగా కొన్ని రోజుల‌కే ఇద్ద‌రూ విడిగా ఉండ‌డం మొద‌లెట్టారు.

షోయబ్‌ మాలిక్‌, సనా జావేద్‌ జంట జనవరి 19న వివాహబంధంతో ఒక్కటైంది. ఈ మేరకు ఇరువురు తమ సోషల్‌ మీడియా ఖాతాలలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సనా కంటే షోయబ్‌ ఏకంగా 11 ఏండ్లు పెద్దవాడు.  షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న సనా జావేద్ తల్లిదండ్రులది కూడా హైదరాబాదే కావడం విశేషం. అయితే వారు చాలా ఏళ్ల క్రితమే సౌదీ అరేబియాలో స్థిరపడ్డారు. సనా జెడ్డాలో 1993 జూన్ 6న  జన్మించింది.  తర్వాత సనా కుటుంబం కరాచీకి మారింది. కరాచీ యూనివర్శిటీ నుండి డిగ్రీ పొందింది.

షోయబ్‌ మాలిక్‌ 1982లో పాకిస్తాన్‌లోని సియాల్‌కోట్‌లో ఓ మధ్యతరగతి పంజాబీ – ముస్లిం కుటుంబంలో జన్మించాడు. మాలిక్‌ తండ్రి స్థానికంగా చెప్పుల దుకాణాన్ని నడిపేవాడు. తన కొడుకు పాకిస్తాన్‌ జట్టుకు ఆడేందుకు ఆయన చాలా కష్టపడ్డాడు. 2006లో ఆయన గొంతు క్యాన్సర్‌తో చనిపోయాడు.  ఇక 1999లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మాలిక్‌.. ఆ దేశం తరఫున 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. ప్రస్తుతం జాతీయ జట్టులో అతడు చోటు కోల్పోయినా ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగుతున్నాడు.