అయోధ్యలో ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన సీఎం ఆదిత్యానాధ్‌

అయోధ్య‌లో నూత‌నంగా నిర్మించిన రామ మందిరంలో ఈనెల 22న శ్రీరాముడి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ట నేప‌ధ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్  అయోధ్య‌లో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను శుక్ర‌వారం ప‌రిశీలించారు. రామాల‌య ప్రారంభోత్స‌వ వేడుక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని, ఈ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశార‌ని సీఎం యోగి సంతృప్తి వ్య‌క్తం చేశారు. 

ట్రాఫిక్ ప‌ర్య‌వేక్ష‌ణ‌, భ‌ద్ర‌త‌, రామ్ జ‌న్మ‌భూమి తీర్ధ్ క్షేత్ర ట్ర‌స్ట్‌తో స‌మ‌న్వ‌యం వంటి విష‌యాల్లో అధికారులు, మంత్రులు స‌రైన రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ప్ర‌శంసించారు.  వేడుక అనంత‌రం కూడా అయోధ్య రాముడి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌కు స‌క‌ల స‌దుపాయాలు క‌ల్పించే విష‌యంలో ట్ర‌స్ట్ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని సీఎం సూచించారు. 

ఈ కార్య‌క్ర‌మం అత్యంత వైభ‌వోపేతంగా, దైవిక కార్య‌క్ర‌మంగా చ‌రిత్ర‌లో నిలిచేలా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నార‌ని, ఏర్పాట్ల‌న్నీ తుది ద‌శ‌కు చేరుకున్నాయ‌ని యోగి ఆదిత్యానాధ్ వివ‌రించారు. భ‌క్తులు పూర్తిగా స‌హ‌క‌రించి రాముడి ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. టెంట్ సిటీ, ధ‌ర్మ‌శాల‌, హోట‌ల్ వంటి నిర్మాణాలు పూర్త‌య్యాయ‌ని తెలిపారు. 

ల‌క్నో, ప్ర‌యాగ్‌రాజ్‌, ఇత‌ర ప్రాంతాల నుంచి వ‌చ్చే ప్ర‌యాణీకుల‌కు మెరుగైన గ్రీన్ కారిడార్ సిద్ధ‌మైంద‌ని సీఎం తెలిపారు. చ‌లిలో దూర ప్రాంతాల నుంచి ప్ర‌జ‌లు అయోధ్య‌కు కాలిన‌డ‌క‌న రావ‌ద్ద‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. ర‌వాణా సౌక‌ర్యాల‌ను వినియోగించుకుని సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించాల‌ని కోరారు.

అయోధ్య‌కు చేరుకున్న హైద‌రాబాదీ ల‌డ్డూ

ఇలా ఉండగా, హైద‌రాబాదీ రామ భ‌క్తులు,  శ్రీరామ్ క్యాట‌రింగ్ స‌ర్వీసెస్ ఓన‌ర్ ఎన్ నాగ‌భూష‌ణం రెడ్డి త‌యారు చేసిన భారీ ల‌డ్డూ శనివారం తెల్ల‌వారుజామున అయోధ్య‌కు చేరుకున్న‌ది. సుమారు 1265 కేజీల బ‌రువు ఉన్న ఆ ల‌డ్డూ క‌ర‌సేవ‌క్‌పురంకు చేరుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. క్యాట‌రింగ్ వ్యాపారంపై, త‌న కుటుంబంపై రాముడి ఆశీస్సులు ఉన్నాయ‌ని, బ్ర‌తికి ఉన్నంత కాలం రాముడి కోసం ప్ర‌తి రోజు ఒక కేజీ ల‌డ్డూ త‌యారు చేయాల‌ని కాంక్షించాన‌ని నాగ‌భూష‌ణం తెలిపారు. 
 
అయోధ్య‌కు తీసుకువెళ్లిన ల‌డ్డూకు సంబంధించిన ఫుడ్ స‌ర్టిఫికేట్‌ను కూడా తీసుకువ‌చ్చిన‌ట్లు చెప్పారు. తాము త‌యారు చేసిన ల‌డ్డూలు నెల రోజులు వ‌ర‌కు పాడ‌వ‌కుండా ఉంటాయ‌ని పేర్కొంటూ మూడు రోజుల పాటు 25 మంది ఆ అఖండ ల‌డ్డూను త‌యారు చేసిన‌ట్లు తెలిపారు. ఈనెల 17వ తేదీన హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో బ‌య‌లుదేరిన‌ట్లు ఆయ‌న చెప్పారు. 350 కేజీల శ‌న‌గ పిండి, 700 కేజీల చ‌క్క‌ర‌, 40 కిలోల కాజూ, 25కేజీల బాదాం, 4 కిలోల కిస్‌మిస్‌, 40 కిలోల నెయ్యి, 15 కిలోల నూనె, కుంకుమ పువ్వు, ప‌చ్చ క‌ర్పూరంతో ల‌డ్డూను తయారు చేసిన‌ట్లు ఆయ‌న వివరించారు.