
గత వారం రోజులకు పైగా అమెరికాలో భారీగా ఎడతెరిపిలేని మంచు కురుస్తోంది. రహదారులపై దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఈ శీతాకాలపు తుఫాను కారణంగా పదుల సంఖ్యలో మరణాలు సంభవించినట్లు యూఎస్ మీడియా వెల్లడించింది.
వాతావరణ ప్రతికూల పరిస్థితులు కారణంగా సుమారు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. శీతల ఉష్ణోగ్రతలు, చలి గాలులు, దట్టమైన మంచు పేరుకుపోయిన రహదారులపై జరిగిన ఘోర ప్రమాదాల కారణంగా ఈ మరణాలు నమోదైనట్లు పేర్కొంది. టేనస్సీ రాష్ట్రంలో 14 వాతావరణ సంబంధిత మరణాలు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం వెల్లడించింది.
అదేవిధంగా మక్కా తీర్థయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ఐదుగురు మహిళలు మంగళవారం పెన్సిల్వేనియా హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. కెంటుకీలో కూడా ఐదు మరణాలు సంభవించినట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బెషీర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇక ఒరెగాన్ రాష్ట్రంలో మంచు తుఫాను సమయంలో విద్యుత్ పవర్ లైన్ ఆగి ఉన్న కారుపై పడటంతో విద్యుదాఘాతానికి గురై ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు పోర్ట్‌ల్యాండ్ నగర అగ్నిమాపక విభాగం తెలిపింది. ఇల్లినాయిస్, కాన్సాస్, న్యూ హాంప్‌షైర్, న్యూయార్క్, విస్కాన్సిన్, వాషింగ్టన్ తదితర రాష్ట్రాల్లో కూడా మరణాలు నమోదైనట్లు యూఎస్ మీడియా వెల్లడించింది.
మధ్య పశ్చిమ ప్రాంతంలో మంచు తుఫాను ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ నార్త్‌వెస్ట్, రాకీ పర్వతాలు, న్యూ ఇంగ్లాండ్, పశ్చిమ న్యూయార్క్‌లోని కొన్ని ప్రాంతాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు.
న్యూయార్క్‌లోని బఫెలో సమీపంలో ఐదు రోజుల వ్యవధిలో సుమారు 75 అంగుళాల (1.9 మీటర్లు) మంచు కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంచు తుఫాను కారణంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో పాఠశాలను అధికారులు మూసివేశారు. ఈ మంచు తుఫాను ప్రభావం విద్యుత్ సరఫరాపై కూడా తీవ్ర ప్రభావం చూపింది.
తుఫాను వల్ల లక్షలాది మంది ప్రజలు అంధకారంలో చిక్కుకున్నారు. ఒక్క ఒరెగాన్ రాష్ట్రంలోనే 75 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీంతో ఆ రాష్ట్ర గవర్నర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు చలిగాలుల తీవ్రత కారణంగా 1.5 కోట్ల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ తుఫాను కారణంగా వెయ్యికిపైగా విమానాలు రద్దయ్యాయి. మరో 8 వేల విమానాలు ఆసల్యంగా రాకపోకలు సాగిస్తున్నాయి. పలు విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌ను నిలిపివేశారు. వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాలలో చిక్కుకుపోయారు. ఈ వారాంతంలో మంచు ప్రభావం అధికంగా ఉంటుందని ఆ దేశ వాతావరణ విభాగం తెలిపింది.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
ఐఎస్ఐఎస్ చీఫ్ ను హతమార్చిన అమెరికా దళాలు
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!