అమెరికాలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్

టి20 ప్రపంచకప్ కు మరో ఐదు నెలల సమయం ఉంది. వెస్టిండీస్, అమెరికాలు సంయుక్తంగా ఈ ప్రపంచకప్ కు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో అందరి చూపు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పైనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచకప్ లో భారత్, పాక్ తలపడుతున్నాయంటే ప్రఖ్యాత మైదానాలనే ఎంపిక చేస్తుంటారు. అయితే ఈసారి ప్రపంచకప్ కు విండీస్ తో పాటు అమెరికా ఆతిథ్యం ఇస్తుంది.

సాధారణంగా అమెరికాలో క్రికెట్ కు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు. మ్యాచ్ లు నిర్వహించడానికి ఉత్తమ సౌకర్యాలతో కూడిన మైదానాలు కూడా లేవు. ఇప్పుడిప్పుడే అమెరికాలో క్రికెట్ పై ఆసక్తి పెరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం మరో దేశం నుంచి పిచ్ ను తయారు చేయించి తెప్పించడం.. ఫార్ములావన్ సర్క్యూట్ నుంచి సీట్లు తెప్పించి మ్యాచ్ వేదికలో బిగించడం లాంటి ప్రత్యేక ఏర్పాట్లను ఐసీసీ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

వాస్తవానికి ఉత్తమ పిచ్ తయారీకి స్టేడియంలోని నేల అనువుగా లేని పరిస్థితుల్లో డ్రాప్ ఇన్ పిచ్ లను ఉపయోగిస్తారు. టి20 ప్రపంచకప్ లో ఐసీసీ అదే పద్దతి అవలంభించనుంది. డ్రాప్ ఇన్ పిచ్ లు తయారు చేయడంలో నిపుణుడైన అడిలైడ్ ఓవల్ క్యురేటర్ డామియన్ హోతో ఐసీసీ ఒప్పందం చేసుకుంది. జూన్ 9న న్యూయార్క్ లోని నసావు మైదానంలో జరిగే భారత్, పాక్ మ్యాచ్ కోసం హో బృందం అడిలైడ్ లో డ్రాప్ ఇన్ పిచ్ తయారు చేస్తోంది. ట్రేలలో పిచ్ మిశ్రమాన్ని సిద్ధం చేసి కంటైనర్ల ద్వారా వాటిని న్యూయార్క్ కు రవాణా చేయబోతున్నారు. మైదానంలో ఈ ట్రేలను అమర్చి పిచ్ ను సిద్ధం చేస్తారు.

భారత్, పాక్ మ్యాచ్ కు మాత్రమే కాకుండా మరి కొన్ని మ్యాచ్ లు కూడా డ్రాప్ ఇన్ పిచ్ ల మీదే జరగనున్నాయి. కాగా టి20 ప్రపంచకప్ జూన్ 1 నుంచి జూన్ 29 వరకు జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. నాలుగు గ్రూప్ లుగా విభజించారు. గ్రూప్ ఎలో భారత్ తో పాటు పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికాలు ఉన్నాయి.