చంద్రుడిపై కాలుమోపిన జపాన్‌ స్లిమ్‌!

చందమామపై పరిశోధనలకు జపాన్‌ ప్రయోగించిన స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌(ఎస్‌ఎల్‌ఐఎం-స్లిమ్‌) శుక్రవారం చంద్రుడి ఉపరితలంపై దిగింది. అంతరిక్ష నౌకను ‘పిన్‌పాయింట్‌ టెక్నాలజీ’ ఉపయోగించి చంద్రుడి మధ్య రేఖకు దక్షిణంగా సమీపంలోని ఒక బిలం వాలుపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసినట్టు జపాన్‌ అంతరిక్ష సంస్థ(జక్సా) ప్రకటించింది. 
 
ఈ ఘనత సాధించిన ఐదో దేశంగా జపాన్‌ నిలిచింది. లక్ష్యానికి 100 మీటర్ల (328 అడుగుల) దూరంలో జపాన్‌ అంతరిక్ష సంస్ థ(జక్సా) ల్యాండింగ్‌ ప్రక్రియను చేపట్టిందని రాయిటర్స్‌ నివేదించింది. అయితే స్లిమ్‌ విజయవంతంపై కొంత సందిగ్ధత నెలకొన్నది.  చంద్రుడిపై ల్యాండింగ్‌ తర్వాత స్లిమ్‌ ప్రస్తుత పరిస్థితిని తనిఖీ చేస్తున్నామని, ల్యాండర్‌తో కమ్యూనికేషన్‌ను పరిశీలిస్తున్నామని జక్సా పేర్కొన్నది. 
 
స్పేస్‌క్రాఫ్ట్‌ సోలార్‌ ప్యానెళ్లు మినహా మిగతా అంతా బాగానే పనిచేస్తున్నదని, అసలేం జరిగిందో పూర్తి సమాచారం సేకరిస్తున్నామని జక్సా అధికారి హితోషి కునినాకా తెలిపారు. సోలార్‌ ప్యానెళ్లు విద్యుత్తు ఉత్పత్తి చేయకుంటే.. స్లిమ్‌ పూర్తిగా బ్యాటరీ సిస్టమ్‌పైనే ఆధారపడాల్సి ఉంటుంది.  కాగా, ఇప్పటి వరకు చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన దేశాల జాబితాలో సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా, భారత్‌ ఉన్నాయి.
స్లిమ్ ప్రయాణం సెప్టెంబర్ 7, 2023న తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి హెచ్-11ఎ  రాకెట్‌లో ప్రయోగించినప్పుడు ప్రారంభమైంది. మిషన్ ఆర్కిటెక్చర్ చంద్రునిర కక్ష్యలోకి ప్రవేశించడానికి చిన్న బ్రేకింగ్ బర్న్ చేయడానికి ముందు చంద్రుని చుట్టూ సుదీర్ఘమైన, లూపింగ్ కక్ష్యలోకి ప్రవేశించడం ద్వారా ఇంధనం, ద్రవ్యరాశి, వ్యయాన్ని ఆదా చేసే వినూత్న పథాన్ని కలిగి ఉంది.
షియోలీ క్రేటర్ సమీపంలోని ల్యాండింగ్ సైట్ దాని శాస్త్రీయ సామర్థ్యం కోసం ఎంపిక చేశారు. డేటా ఆలివిన్ ఉనికిని సూచిస్తుంది. ఇది చంద్రుని మాంటిల్‌పై అంతర్దృష్టులను అందించగలదు. చంద్రుని నిర్మాణం, పరిణామంపై మన అవగాహనకు దోహదం చేస్తుంది.