22న ఒడిశాలోనూ రామ మందిరం ప్రారంభం

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో ఈ నెల 22న విగ్రహాల ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుండగా, అదే రోజున ఒడిశాలో నిర్మించిన రామ మందిరాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. నయాగఢ్ జిల్లాలోని ఫతేగఢ్ గ్రామంలో ఈ రామాలయాన్ని నిర్మించారు. 
 
సముద్ర మట్టానికి 1800 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ‘బౌలమాల’ రాయితో ఆలయం నిర్మాణం చేపట్టారు. 2017లో ఈ గుడి నిర్మాణం ప్రారంభమైంది. సుమారు 150 మందికిపైగా కార్మికులు ఏడేళ్లుగా శ్రమించారు. 165 అడుగుల పొడవైన రామ మందిరాన్ని నిర్మించారు. చుట్టూ పచ్చదనంతో కూడిన రామాలయం ఎంతో ఆకట్టుకుంటున్నది.

కాగా, ఒడిశాలోని ఫతేగఢ్ గ్రామంలో రామ మందిరం నిర్మాణం వెనుక కూడా చారిత్రక ప్రాధాన్యత ఉంది. ఇక్కడి పర్వతంపై కొలువైన గోవర్ధనుడు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్నాడు. 1912లో జగన్నాథుడి నవకళేబర్ కోసం సుదర్శన్ చెట్టును ఫతేగఢ్‌ నుంచి సేకరించారు.  ఈ నేపథ్యంలో ఇక్కడ రామాలయాన్ని నిర్మించేందుకు గ్రామస్తులు చొరవ చూపారు.

శ్రీరామ సేవా పరిషత్‌ పేరుతో కమిటీని ఏర్పాటు చేశారు. సామాజిక కార్యకర్త, భాపూర్ బ్లాక్ వైస్ చైర్ పర్సన్ ఈ కమిటీ అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఆలయ నిర్మాణం పనులు ప్రారంభించారు. మరోవైపు ఈ నెల 22న ఒడిశాలోని రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన పూజా క్రతువులు ఒక రోజు ముందుగానే మొదలు కానున్నాయి. 

ఆలయ ప్రారంభ మహోత్సవానికి హాజరు కావాలని పూరీ శంకరాచార్య, మహారాజులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంతోపాటు వివిధ ఆలయాల పూజారులు, అధికారులు, పలువురు ప్రముఖులను కూడా రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు.