విచ్చలవిడి యాంటిబయోటిక్స్ వినియోగంపై కేంద్రం సీరియస్

అవసరం ఉన్నా లేకపోయినా.. జబ్బుకు సంబంధించిన ఔషధాలతో పాటు.. యాంటీబయాటిక్స్ ఒకటో రెండో తప్పనిసరి అయిపోయింది. దీంతో వీటి వినియోగంతో తలెత్తుతున్న దుష్పరిణామాలపై కేంద్ర ఆరోగ్యశాఖ సీరియస్ ఫోకస్ చేసింది. యాంటీబయాటిక్స్ వినియోగంపై కేంద్ర ఆరోగ్యశాఖ తీవ్రమైన ఆంక్షలు పెట్టింది. ఇకపై యాంటీబయాటిక్స్ రాయాల్సి వస్తే.. సదరు వైద్యుడు రోగికి ఆ విషయం తెలియజేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. వాటి వినియోగంపై సలహాలు, సూచనలు కూడా తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కేంద్ర ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వినియోగంతో గతకొన్నేళ్లుగా మానవాళి తీవ్ర సమస్యను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా యాంటీ మైక్రోబియల్ నిరోధకత అనే రుగ్మత.. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమవుతోంది. ఇది ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 రోగాల్లో ఇదొకటని.. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ రుగ్మతతో 12 లక్షలకు పైగా మరణించారని.. తెలుస్తోంది. అంతేకాకుండా.. 49.5 లక్షల మంది వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో ప్రాణాలు కోల్పోయారని.. వీటన్నింటికీ కారణం.. రకరకాల యాంటీబయాటిక్సే అని తేలిందని.. కేంద్ర ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకంతో.. మనుషుల్లో ఔషధాలకు లొంగని రకరకాల రుగ్మతలు తీవ్రమవుతున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ పరిధిలోని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ చీఫ్ అతుల్‌ గోయల్‌ తెలిపారు. దీని వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతున్నాయని.. సుదీర్ఘ కాలం పాటు ఈ కొత్త రోగాలతో మనుషులు సతమతమవుతున్నారని అన్నారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే దేశంలోని అన్ని మెడికల్‌, ఫార్మసిస్ట్‌ సంఘాలకు, వైద్యకళాశాలకు ‘అత్యవసర విజ్ఞప్తి’ పేరిట అతుల్ గోయల్ లేఖలు రాశారు. పరిమితంతో పాటు.. వివేకవంతంగా యాంటీబయాటిక్‌లను వాడాలని దేశంలోని వైద్యలకు ఆ లేఖలో ఆయన హితవు పలికారు. యాంటీబయాటిక్‌ల రాసేముందు.. దానికి గల కచ్చితమైన కారణాలను ప్రిస్ర్కిప్షన్‌లో పేర్కొనాలని స్పష్టం చేశారు.

అర్హతలున్న వైద్యుడి ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా మెడికల్‌ షాపుల వాళ్లు ఎవరికీ యాంటీబయాటిక్‌లను విక్రయించకూడదని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. యాంటీ మైక్రోబియల్‌ నిరోధకత ఒక నిశ్శబ్ద మహమ్మారి అని.. దీనివల్ల 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా కోటి మందికి పైగా మరణించే ప్రమాదం ఉందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలోనే హెచ్చరించిందని.. లేఖలో వివరించారు.