ప్రాణ ప్రతిష్ట రోజున కేంద్రం సగం రోజు సెలవు

అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠకు ముహూర్తం దగ్గర పడుతుంది. ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా వేలమంది ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ‘సగం రోజు సెలవు’ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆఫీసులన్నింటికీ ఈ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది.  
 
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ట వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలను మూసివేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. కార్యక్రమం పూర్తయ్యే వరకూ ఈ సగం రోజు సెలవు వర్తిస్తుందని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, ఆర్థిక సంస్థలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సైతం 22న సగం రోజు మూసి ఉంటాయి.
22న సుప్రీంకోర్టుతో పాటు దేశంలో అన్ని న్యాయస్థానాలకు సెలవు ప్రకటించాలని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ మన్నన్‌ కుమార్‌ మిశ్రా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.  మరోవైపు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీ- ఎన్సీఆర్‌ ప్రాంతంలో 22వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.  ఉత్తరప్రదేశ్‌, గోవా, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా సహా పలు రాష్ట్రాలు సైతం ప్రాణ ప్రతిష్ట రోజున సెలవు ప్రకటించాయి. సుప్రీం కోర్టుకు కూడా ఆ ఇక, గ్రేటర్‌ నోయిడా, ఢిల్లీ, గురుగ్రామ్‌లో మద్యం దుకాణాలను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
అయోధ్య కోసం ప్రత్యేక వెబ్‌పేజి

అయోధ్యలో రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆ నగరానికి, ముఖ్యమైన పరిసర ప్రాంతాలకు సంబంధించిన వాతావరణ సమాచారం అందజేయడానికి ప్రత్యేక వెబ్‌పేజిని గురువారం ప్రారంభించింది. ఉష్ణోగ్రత, తేమ, గాలి తీరుతో సహా వాతావరణ కొలబద్దల సమాచారం వెబ్ పేజీలో ఉంటుంది. 

హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ వంటి వివిధ ప్రధాన భాషల్లో ఆ సమాచారం అందుబాటులో ఉంటుంది. అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, లక్నో, న్యూఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రదేశాలకు సంబంధించిన వాతావరణ సమాచారం వెబ్‌పేజీలో లభిస్తుంది.