లొకేషన్‌ మార్కర్‌గా విక్రమ్‌ ల్యాండర్‌

ఇలా ఉండగా, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన ఇస్రో చంద్రయాన్-3 ద్వారా పంపిన విక్రమ్‌ ల్యాండర్‌ అంచనాలకు మించి సేవలు అందిస్తున్నది. విక్రమ్‌ ల్యాండర్‌లోని ‘ది లేజర్‌ రెస్ట్రో రిఫ్లెక్టర్‌ ఎరే(ఎల్‌ఆర్‌ఏ) పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్‌ మార్కర్‌గా పని చేస్తున్నట్టు  ఇస్రో ఒక ప్రకటనలో తెలిపింది. 
 
గతేడాది డిసెంబర్‌ 12 నుంచి నాసాకు చెందిన లూనార్‌ రికనైసెన్స్‌ ఆర్బిటల్‌ ఎల్‌ఆర్‌ఏ నుంచి సంకేతాలను గుర్తించినట్టు పేర్కొంది.
అంతర్జాతీయ సహకార ఒప్పందంలో భాగంగా నాసాకు చెందిన ఎల్‌ఆర్‌ఏను విక్రమ్‌ ల్యాండర్‌లో పొందుపరిచారు. ఇందులో అర్ధ గోళాకారంలో ఉన్న 8 కార్నర్‌ క్యూబ్‌ రిఫ్లెక్టర్లు ఉంటాయి. 
 
ఏదైనా అంతరిక్ష నౌక ద్వారా విడుదలైన లేజర్‌ కిరణాలను ఇవి వికిరణం చేస్తాయి. చంద్రుడిపైకి వివిధ ఎల్‌ఆర్‌ఏలు పంపినప్పటికీ, మిగతా వాటితో పోలిస్తే చంద్రయాన్‌-3లోని ఎల్‌ఆర్‌ఏ పరిమాణంలో చిన్నది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేవలందిస్తున్న ఎల్‌ఆర్‌ఏ ఇదొక్కటే. 20 గ్రాముల బరువుండే ఈ పరికరాన్ని భవిష్యత్తులో దశాబ్దాల పాటు సేవలందించేలా రూపొందించారు. 
 
చంద్రయాన్‌ -3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్‌ ల్యాండర్‌ గతేడాది ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగింది. 14 రోజులపాటు ప్రజ్ఞాన్‌ రోవర్‌తోపాటు జాబిలిపై పరిశోధనలు చేసింది. భూమికి విలువైన సమాచారాన్ని చేరవేసింది.