జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటీషన్ ను కొట్టివేయాలన్న జగన్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటీషన్ వేసినందునే బెయిల్ రద్దు పిటీషన్ వేశారని  జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోతగి కోర్టు దృష్టికి తెచ్చారు.
 
అయితే, ఈ కేసులో తాము రాజకీయ పరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. జగన్ బెయిల్ రద్దు కేసు ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేసింది. జగన్ కేసుల విచారణ జాప్యానికి కారణమేంటి? ఎవరు బాధ్యులు? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.  డిశ్చార్జ్ పిటీషన్లను విచారించడానికి ఎందుకంత సమయం తీసుకున్నారని ప్రశ్నించింది. 
అయితే విచారణ జాప్యంలో, వాయిదాల విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా సీబీఐకి సంబంధం లేకపోతే వేరే ఎవరికి సంబంధం ఉంటుదని ప్రశ్నించారు. సీబీఐ, జగన్ కుమ్మక్కై కేసును జాప్యం చేస్తున్నారని ఈ సందర్భంగా పిటిషనర్ ఎంపీ రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఆరోపించారు. 

దీంతో గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు గత ఏడాది డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టులో ప్రస్తావించారు.  హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో జగన్ కేసుల విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతవరకు కేసుల విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా వేస్తున్నామని వెల్లడించింది.

కాగా, జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ రెండు పిటీషన్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్లపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరిపింది.
జగన్ బెయిల్ రద్దు, ట్రాన్స్ ఫర్ పిటీషన్లపై సిబిఐకి గతంలో నోటీసులు జారీచేసిన సుప్రీంకోర్టు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జాప్యమెందుకు జరుగుతుందో చెప్పాలని సిబిఐని ప్రశ్నించింది.

రామానాయుడు స్టూడియో కేసులో చుక్కెదురు

మరోవంక, విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆ భూములను లేఔట్ గా మార్చి అమ్మడంపై స్టే విధించింది. 2003 సెప్టెంబర్ 13న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలు మినహా ఇతర కార్యకలాపాలకు ఆ భూములు వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై మార్చి 11లోపు స్పందించాలని ఆదేశించింది. రామానాయుడు స్టూడియోకు సినీ అవసరాల కోసం 2003లో అప్పటి ప్రభుత్వం విశాఖలో 35 ఎకరాల భూమిని కేటాయించింది. 

అయితే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోస్టల్ నిబంధనలకు విరుద్ధంగా లేఔట్ ను మార్చి ఇతర కార్యకలాపాలకు వినియోగించుకునేందుకు అనుమతించింది. ఈ వ్యవహారాన్ని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

పిటిషన్ పై విచారణను జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖాల ధర్మాసనం చేపట్టింది. రామానాయుడు స్టూడియోకి భూమిని ఎందుకు కేటాయించారు? ఇప్పుడు వేరే కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది.  సినీ స్టూడియో నిర్మాణానికి భూమిని కేటాయించారని, దానికి అనుగుణంగా స్టూడియో నిర్మాణం చేపట్టకుండా లేఔట్ వేసి అమ్మకాలకు సిద్ధం చేశారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. దీంతో స్టే విధించిన కోర్టు ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.