తెలంగాణకు గుదిబండగా మారుతున్న కాళేశ్వరం

ఆసియాలోనే అత్యద్భుతమైన నిర్మాణంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నిన్నటి వరకు బిఆర్ఎస్ ప్రభుత్వ నేతలు ప్రచారం చేసుకున్నారు. అయితే ఎన్నికల ముందే మేడిగడ్డ ప్రాజెక్టులో లొసుగులు బయటపడటం, అంతకు ముందు కూడా వర్షాలు వచ్చినప్పుడు వరదలకు తట్టుకోలేక పోవడంతో ప్రాజెక్ట్ నిర్మాణంపై అనుమానాలు వెల్లడి అవుతూ వచ్చాయి. తాజాగా కాగ్ నివేదిక నిర్మాణ వ్యయం భవిష్యత్ లో కూడా తెలంగాణ ప్రజలకు ఓ గుదిబండగా మారనున్నట్లు వెల్లడి చేసింది.
 
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఒక రూపాయి ఖర్చు చేస్తే నికరంగా దాని నుంచి వచ్చే ఆదాయం 52 పైసలు మాత్రమేనని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) స్పష్టం చేసింది. అందువల్ల, ఈ ప్రాజెక్టు ఆర్థికంగా అంత ప్రయోజనకరం కాదని తేల్చి చెప్పింది.  ఈ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం వందల కోట్లు ఖర్చవుతున్నాయి. కాళేశ్వరంలోని అన్ని పంపులు నడిపితే ఏటా రూ.936.97 కోట్ల కరెంట్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
 
ప్రాజెక్టులో ఒక్క మోటారు నడిచినా, నడువకున్నా ఏటా ఫిక్స్ డ్ ఛాచార్జీల రూపేణ రూ.1,337.59 కోట్లు చెల్లించి తీరాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన లోన్ల రీపేమెంట్, కరెంట్ బిల్లులు, ప్రాజెక్టు ఆపరేషన్ అండ్మెయింటనెన్స్ కు వెచ్చించే మొత్తాన్ని కలుపుకుంటే ఏటా బడ్జెట్లో రూ.25 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మరోవంక, కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో తీవ్రమైన సమస్యలు మూడేళ్ల క్రితమే బయటపడినట్లు వెలుగులోకొచ్చింది. అయితే గత పాలకులు మాత్రం వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ మూడు బ్యారేజీల్లో నీటి నిల్వ సామర్థ్యం, గేట్లు ఎత్తినప్పుడు నీరు కిందకు విడుదల సమయంలో నీటి వేగాన్ని తట్టుకునే విధంగా రక్షణ గోడ సామర్థ్యం తక్కువగా ఉండటం వంటి సమస్యలు బయటపడ్డాయి.
 
ఈ సమస్యకు పరిష్కారంగా ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ వంటి సంస్థలతో అధ్యయనాలు చేయించి తగు చర్యలు తీసుకోవాలని 2020 జనవరి 8న సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కి లేఖ రాశారు. అయినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోలేదన్న విషయం వెలుగులోకొచ్చింది. 
ఇప్పుడు మూడేళ్ల తర్వాత, సమస్య తీవ్రత పెరిగాక తాజాగా ఆ సంస్థతో అధ్యయనం చేయించడానికి లేఖ రాసినట్లు తెలిసింది.
గేట్ల నిర్వహణలో లోపం, బ్యారేజీ సమీపంలో గేట్ల ఎగువన ఇసుక మేట వేయడం, పర్యవసానంగా ఎక్కువ కేంద్రీకృత వేగంతో నీటి ప్రవాహం, గేట్ల నుంచి నీటి విడుదల సమయంలో ప్రవాహ వేగం నిలకడగా లేకపోవడం వల్ల రక్షణ వ్యవస్థ దెబ్బతినడం తదితర అంశాలపై సీడీవో వివరంగా పేర్కొన్నారు.  ఏటా ప్రాజెక్టుకు అయ్యే వ్యయం రూ.14,351 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపిందని, కానీ, అది రూ.28,270 కోట్లు ఉంటుందని కాగ్‌ అంచనా వేసింది.
2031-32 ఆర్థిక సంవత్సరం వరకు కాళేశ్వరంపై ఏటా రూ.24 వేల కోట్ల నుంచి రూ.21 వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని, తెలంగాణకు ఈ ప్రాజెక్టు వల్ల నష్టమే ఎక్కువని వాదనాలు వినిపిస్తున్నాయి.  ఆ తర్వాతి రెండేళ్లు రూ.19 వేల కోట్లకు పైగా, 2034 -35లో రూ.15 వేల కోట్లు, 2035 -36 ఆర్థిక సంవత్సరంలో రూ.11,359 కోట్లు ఖజానా నుంచే తిరిగి చెల్లించాల్సి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాళేశ్వరం ద్వారా 195 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ప్రతి సంవత్సరం కరెంట్ బిల్లుల కోసమే రూ.9,400 కోట్లు కేటాయించాలి. అలాగే, ఏమాత్రం ఆదాయం లేని కాళేశ్వరం కార్పొరేషన్‌ నుంచి రుణాలు/అసలు/వడ్డీ చెల్లింపులకు ఏటా ప్రభుత్వం నుంచి రూ.14,462 కోట్లను చెల్లించాలని తెలిపింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాని పరిధిలో వ్యవసాయోత్పత్తుల విలువ రూ.12,553 కోట్లు ఉంటుందని ప్రభుత్వం నివేదించిందని, కానీ అది రూ.10,577 కోట్లు దాటదని కాగ్‌ లెక్కించింది.  
ఇక చేపల పెంపకం (ఫిషరీస్‌); పారిశ్రామిక అవసరాలకు నీటి వినియోగం కింద రూ.5555 కోట్లు వస్తాయని అంచనా వేసిందని, కానీ, ఆ మొత్తం రూ.1069 కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పింది.  వెరసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వార్షికాదాయాన్ని రూ.21,682 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చూపించిందని, కానీ అది రూ.14,709 కోట్లు మాత్రమేనని లెక్కకట్టింది. కాళేశ్వరం నిర్మాణానికి రూ.87,449 కోట్ల రుణాలు తీసుకున్నారని, వడ్డీ కింద రూ.54,174 కోట్లు అవుతుందని, అంతిమంగా రూ.1.41 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది.
అసలు, వడ్డీ చెల్లింపులకు కావాల్సిన ఆర్థిక వనరులు కాళేశ్వరం కార్పొరేషన్‌కు లేవని, వాటిని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ప్రాజెక్టు నిర్మాణానికి రూ.87 వేల కోట్లు ఖర్చు చేస్తే.. కొత్తగా సృష్టించిన ఆయకట్టు 40,288 ఎకరాలు మాత్రమేనని కాగ్‌ గుర్తు చేసింది ఇక ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలు కేవలం డిజైన్ కు సంబంధించినవి మాత్రమే కాదని, అధ్యయనం చేయించి అవసరమైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. 
ప్రాజెక్ట్ గేట్లు ఎత్తాక నీరు కిందకు దూకే వేగాన్ని షూటింగ్ వెలాసిటీ అంటారు. ఇది సరాసరి 4 నుంచి 5 మీటర్లు ఉండాలి. కానీ కాళేశ్వరం బ్యారేజీల్లో మాత్రం ఏకంగా 16 నుంచి 18 మీటర్ల వరకు ఉంది. దీంతో దిగువకు విడుదలయ్యే సమయంలో నీటి వేగానికి బ్యారేజీల దిగువన ఉన్న రక్షణ దిమ్మెలు కొట్టుకుపోయాయి.
 
అసలే మేడిగడ్డ బ్యారేజ్ కట్టిన ప్రాంతంలో నీటి లభ్యత అధికంగా ఉంటుంది. అందుకే అక్కడ నిర్మించారు. దీంతో షూటింగ్ వెలాసిటీ అధికంగా ఉంటుంది. కానీ దాన్ని అంచనా వేయకుండా నిర్మాణం చేపట్టడంతో బ్యారేజీ దిగువన ఉన్న కాంక్రీట్ బ్లాకులు చెల్లాచెదురైపోయాయి. ఇటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిస్థితి కూడా ఇంతే. నిర్మాణ లోపాలు బయటపడినప్పుడే సరిదిద్దుకుంటే ఇప్పుడీ పరిస్థితి వచ్చేది కాదని నిపుణులు చెబుతున్నారు.