అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషాపై వేటు

2021 తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఏకంగా 30 వేలకు పైగా దొంగ ఓట్లను అధికార పార్టీకి అనుకూలంగా వేయించటానికి ప్రధాన కారకుడైన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరిషాపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు వేయటం.. ఆలిండియా సర్వీస్ అధికారుల్లో కలకలం రేపుతోంది. ఎన్నికల అక్రమాలకు సంబంధించి ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ కావటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలకు అధికారులే అండదండలు అందిస్తున్న వైనం.. తాజా సస్పెన్షన్ వేటుతో వెల్లడి అయ్యింది.

ఇక.. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న ఐఏఎస్ అధికారి గిరీషా.. ఎన్నికల అధికారిగా కూడా విధులు నిర్వహించారు. ఆ సమయంలోనే తన అధికారిక ఐడీ నుంచి ఏకంగా 30 వేలకు పైగా ఓటర్ ఎపిక్ కార్డుల్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేశారు. వీటిని వైసీపీ నాయకులకు అందించటంతో.. వాటిపై ఫోటోలను మార్ఫింగ్ చేసి విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేశారని టీడీపీ, బీజేపీ వంటి పార్టీలు ఆరోపిస్తున్నాయి.

కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయటంతో.. ఈసీ దీనిపై ఫోకస్ పెట్టింది. విచారణలో గిరీషా అక్రమాలన్నీ వెలుగు చూడటంతో రెండేళ్ళ తరువాత ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారం ఒక్క గిరీషాతోనే అయిపోలేదు. ఇంకా అనేక మంది అధికారులపై ఇదే తరహాలో ఎన్నికల అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.