ఇరాన్‌పై పాకిస్థాన్‌ ప్రతీకార దాడులు

* ఉగ్రవాదంపై దేశాల చర్యలను ఆత్మరక్షణ కోసమన్న భారత్

పాకిస్థాన్‌ లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి జరిపిన ఇరాన్ కు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించిన పాకిస్థాన్ గురువారం ప్రతీకార దాడికి దిగింది.  తమ గగనతలంలోకి చొరబడి ఉగ్రవాద సంస్థ జైష్ అల్-అద్ల్ స్థావరాలను ధ్వంసం చేసిన ఇరాన్‌పై ప్రతీకార దాడులకు దిగింది. 
ఇరాన్‌లోని బలూచ్ వేర్పాటువాద గ్రూపులైన ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్‘, ‘బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’లకు చెందిన పోస్టులపై క్షిపణులతో విరుచుకుపడింది. పలు స్థావరాలను ధ్వంసం చేసినట్టు అంతర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇరాన్‌లోని ఏడు ప్రాంతాల్లో పాక్ క్షిపణి దాడులు చేసినట్టు తెలుస్తోంది. 
 
ఉగ్రవాదుల రహస్య స్థావరాలు, శిక్షణా శిబిరాలను ధ్వంసం చేసినట్టు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇరాన్, పాకిస్తాన్ పరస్పరం జరుపుకున్న ఈ దాడులలో మొత్తం మీద కనీసం 11 మంది చనిపోయిన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతీకార దాడులపై పాకిస్థాన్, ఇరాన్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.  పాకిస్థాన్‌లోని జైష్-అల్-అదల్‌ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై మంగళవారం ఇరాన్‌ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి దాడికి దిగింది.  

ఇరాన్ తమ గగనతలాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి జలీల్ అబ్బాస్ జిలానీ మంగళవారం తీవ్రంగా హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి ఇరాన్ దాడులకు పాల్పడిందని, ప్రతీకార చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని, తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఇరాన్‌ దాడులను ఖండించిన పాకిస్థాన్ ఇరాన్‌ రాయబారిని బహిష్కరించింది. ప్రస్తుతం ఇరాన్‌ పర్యటనలో ఉన్న ఆ రాయబారిని పాకిస్థాన్‌కు తిరిగి రావద్దని పేర్కొంది. అలాగే ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఉన్న తమ రాయబారులను పాకిస్థాన్‌ వెనక్కి పిలిపించింది. ఉన్నత స్థాయి అధికారుల ఇరాన్‌ సందర్శనను కూడా రద్దు చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ఇలా ఉండగా, పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాద సంస్థ ‘జైష్ అల్-అద్ల్’ స్థావరాలపై ఇరాన్ ఇటీవల జరిపిన వైమానిక దాడులను భారత్ పరోక్షంగా సమర్ధించింది.  ఈ వ్యవహారం పాకిస్థాన్, ఇరాన్‌ల మధ్య సమస్యగా పేర్కొని తన వైఖరిని స్పష్టం చేసింది.  “భారత్ విషయానికి వస్తే ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం రాజీలేదు. తీవ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు. ఉగ్రవాదంపై దేశాలు తీసుకునే చర్యలు ఆత్మరక్షణ కోసమని అర్థం చేసుకోగలం’’ అంటూ  విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటన విడుదల చేశారు.