విద్యుత్ చార్జీలు ఎప్పటికప్పుడు పెంచుకునే వెసులుబాటు

ఇకపై డిస్కంలు విద్యుత్ పంపిణీ చేసేందుకు ఎంత వ్యయం అవుతుందో  ఆ మొత్తాన్ని వినియోగదారుల నుంచి చార్జీల రూపంలో రాబట్టుకునేందుకు వీలుగా కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్ణయం తీసుకున్నది. ఇందుకు అనుగుణంగా విద్యుత్తు (సవరణ) నిబంధనలు, 2024 పేరుతో గెజిట్‌ ప్రచురించింది.
ఇందుకుగాను విద్యుత్తు చార్జీలను ఎప్పటికప్పుడు పెంచుకునేందుకు ఈ తాజా నిర్ణయం వెసులుబాటు కల్పించనున్నది.
ఈ నెల 10న ఎలక్ట్రిసిటీ (అమెండ్‌మెంట్‌) రూల్స్‌, 2024 పేరిట విడుదల చేసిన గెజిట్‌ను అన్ని రాష్ర్టాలకు పంపించింది.  ప్రతియేటా నవంబర్‌ లోగా. వచ్చే ఆర్థిక సంవత్సరపు ఆదాయానికి సంబంధించిన అంచనాలను డిస్కంలు విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి అందజేయాలి. వాటి ఆధారంగా ఈఆర్సీ డిస్కంల ఆదాయ అవసరాలను పరిశీలిస్తుంది.
సదరు ఆదాయ అంచనాలను చేరుకునేందుకు రాబట్టుకోవాల్సిన విద్యుత్తు చార్జీలను కూడా ఈఆర్సీ ప్రకటిస్తుంది.  తాజా గెజిట్‌లో పొందుపర్చిన నిబంధనల ప్రకారం ఇకపై ఈఆర్సీ ఆమోదించే ఆదాయ అవసరాల మొత్తానికి (ఏఆర్‌ఆర్‌), అలాగే విద్యుత్తు చార్జీలతో వచ్చే ఆదాయ అంచనాలకు మధ్య ఎలాంటి తేడా ఉండకూడదు. కేవలం ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ తేడా కేవలం మూడు శాతంలోపు మాత్రమే ఉండవచ్చు.

అంటే, డిస్కంల వ్యయానికి, వచ్చే ఆదాయానికి మధ్యన ఎలాంటి తేడా ఉండకూడదన్నమాట. అలా జరగాలంటే తమ వ్యయానికి అయ్యే మొత్తాన్ని విద్యుత్తు చార్జీల రూపంలో వసూలు చేసుకొనేలా ఈఆర్సీలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది.  ఒకవేళ విద్యుత్తు ఉత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన సొమ్మును గడువులోగా డిస్కంలు చెల్లించకపోతే  అవి విధించే లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీతోపాటు, ఆదాయ వ్యత్యాసాన్ని కూడా కలిపి వచ్చే మూడేండ్లలో మూడు సమ వాయిదాల్లో వసూలు చేసుకోవచ్చని తాజా నిబంధనల్లో స్పష్టం చేశారు.

ఈ గెజిట్‌ అమల్లోకి రాకముందు ఉన్న ఆదాయ వ్యత్యాసాలు, లేట్‌ పేమెంట్‌ సర్‌చార్జీలను వచ్చే ఏడేండ్లలో ఏడు సమ వాయిదాల్లో వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవాలని అందులో స్పష్టం చేశారు. దీనితోపాటు, ఏదైనా విద్యుత్తు ఉత్పత్తి కంపెనీ/కాప్టివ్‌ విద్యుత్తు ప్లాంటు/ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థ తమ అవసరాల కోసం ప్రత్యేక ట్రాన్స్‌మిషన్‌ లైన్లను ఏర్పాటు చేసుకొనేందుకు, నిర్వహణ, గ్రిడ్‌తో అనుసంధానం కోసం ప్రత్యేకంగా లైసెన్స్‌ తీసుకోవాల్సిన అవసరం లేదని తాజా గెజిట్‌లో పేర్కొన్నారు. 

అయితే వాటి సామర్థ్యం అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ పరిధిలో 25 మెగావాట్లు, రాష్ట్ర అంతర్గత ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ పరిధిలో 15 మెగావాట్లకు మించకూడకుండా ఉండాలి. ఇదంతా సాంకేతిక ప్రమాణాలు, మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం ఉంటుంది. అన్ని రకాల ఓపెన్‌ యాక్సెస్‌ వినియోగదారులపై విధించే అదనపు సర్‌చార్జీలు, డిస్కంలు కొనుగోలు చేసే విద్యుత్తుకు సంబంధించిన ఫిక్స్‌డ్‌ చార్జీలకు మించకుండా ఉండలని అందులో పొందుపర్చారు.