నిర్మాణ సంస్థల్లో ఐటీ సోదాల్లో రూ.1500 కోట్ల నగదు

ప్రముఖ నిర్మాణ సంస్థ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు సోదాలు చేశారు.\భారీగా పన్నులు ఎగవేసినట్లు గుర్తించారు. లెక్కల్లో చూపని రూ.1500 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 
 
భూటానీ ఇన్‌ఫ్రా, గ్రూప్ 108, అడ్వెంట్, లాజిక్స్‌ నిర్మాణ గ్రూపు సంస్థలు భారీగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుమారు 250 మంది ఐటీ అధికారులు 40 బృందాలుగా ఏర్పడ్డారు. మహాకాల్‌ పేరుతో రైడ్స్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. 
 
నాలుగు నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో ఆరు రోజులపాటు సోదాలు జరిపారు. లెక్కల్లో చూపని సుమారు రూ.1500 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.  కాగా, భూటానీ గ్రూప్ ఉద్యోగులు దాచిన రెండు పెన్ డ్రైవ్‌లను ఐటీ అధికారులు కనుగొన్నారు. ఆ కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు అందిన సమాచారం అందులో ఉంది. 
 
2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఆ గ్రూప్ మొత్తం రూ. 429 కోట్ల నగదు పొందినట్లు వివరాలున్నాయి. 2019 నుంచి మూడేళ్లలో రూ. 595 కోట్ల నగదును భూటానీ గ్రూప్ ఆమోదించినట్లు పెన్ డ్రైవ్‌లోని డేటా ద్వారా ఐటీ అధికారులు తెలుసుకున్నారు. దీనికి సంబంధించి ఆ సంస్థ ఉద్యోగుల స్టేట్‌మెంట్లను రికార్డ్‌ చేశారు. 
 
పన్ను ఎగవేత హమీతో భారీగా ప్రకటనలు ఇవ్వడంతోపాటు పెట్టుబడిదారులు, బ్రోకర్లకు ఖచ్చితమైన క్యాష్ రిటర్న్‌లు అందించినట్లు ఐటీ అధికారుల దర్యాప్తులో బయటపడింది.