శరవేగంగా ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు

బుల్లెట్‌ రైలుకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చెడుబుతూ ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ చెప్పారు. పనులు సకాలంలోనే జరుగుతున్నాయని చెప్పారు. 
 
ముంబయి – థానే మధ్య సముద్రగర్భంలో టన్నెల్‌ పనులు సైతం ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇదే మార్గంలో ఎనిమిది నదులపై వంతెన పనులను సైతం శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే రెండు వంతెనల పనులు పూర్తయ్యాయని, సబర్మతి టెర్మినల్ స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయని వివరించారు.

జపాన్ షింకన్‌సెన్ టెక్నాలజీని ఉపయోగించి హై-స్పీడ్ రైలు మార్గాన్ని కేంద్రం నిర్మిస్తున్నది. రూ.88వేలకోట్ల సాఫ్ట్ లోన్‌తో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూరుస్తుంది.  రూ.1.10 లక్షల కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 2022 నాటికి పూర్తి చేయాలని భావించినప్పటికీ భూసేకరణలో అడ్డంకులు ఎదురయ్యాయి. 2026 నాటికి దక్షిణ గుజరాత్‌లోని సూరత్, బిలిమోరా మధ్య మొదటి దశ బుల్లెట్ రైలును నడపాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.

అయోధ్య రామ మందిరం ప్రారంభం నేపథ్యంలో అయోధ్య ధామ్‌ స్టేషన్‌ సామర్థ్యం పెంపు ప్రస్తావిస్తూ  అయోధ్యలో ఐదు స్టేషన్లు ఉన్నాయని, వాటన్నింటి సామర్థ్యాన్ని పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నామని వైష్ణవ్ తెలిపారు. లక్నో నుంచి వచ్చే రైల్వే లైన్లను డబ్లింగ్ చేసే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
 
దాంతో పాటు వారణాసి వెళ్లే లైన్లను సైతం రెట్టింపు చేస్తామని, ప్రయాగ్‌రాజ్, గోరఖ్‌పూర్ నుంచి వచ్చే లైన్లు సైతం పొడిగిస్తున్నట్లు చెప్పారు.  కాగా, ముంబయి- అహ్మదాబాద్ రైల్ కారిడార్ కోసం గుజరాత్, మహారాష్ట్ర, దాద్రానగర్ హవేలీల్లో వందశాతం భూసేకరణ పనులను పూర్తి చేసినట్లు హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలిపింది. 
 
ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం 1389.49 హెక్టార్ల భూమిని సేకరించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ముంబయి- అహ్మదాబాద్ మధ్య హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ కాంట్రాక్టులన్నీ గుజరాత్, మహారాష్ట్రలకు దక్కాయని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. వీటిలో 120.4 కిలోమీటర్ల మేర గర్డర్లను ప్రారంభించగా.. 271 కిలోమీటర్ల మేర పైర్ కాస్టింగ్ పనులు పూర్తయ్యాయి.