గూగుల్ లో వందలాది ఉద్యోగులకు ఉద్వాసన!

నూతన సంవత్సరంలోనూ దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకూ అన్ని టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. తాజాగా గూగుల్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం సంస్థలు వందల మంది ఉద్యోగులపై వేటు వేశాయి. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వందలాది కంపెనీలు లేఆఫ్‌లను ప్రకటిస్తున్నాయి. ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. రాబోయే నెలల్లో మరిన్ని ‘లే ఆఫ్‌’లు ఉంటాయని భావిస్తున్నారు.
ప్రముఖ ఐటీ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టింది. ఇంజనీరింగ్, హార్డ్ వేర్ సహా పలు విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఆల్ఫాబెట్ యాజమాన్యంలోని సంస్థ ఫిట్ బిట్ సహ వ్యవస్థాపకులు జేమ్స్ పార్క్, ఎరిక్ ఫ్రీడ్మన్ లను కూడా తొలగించినట్లు తెలిపింది.
సంస్థ వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా గూగుల్ పలు టీమ్స్ లో ఉద్యోగాల కోతలను అమలు చేస్తోంది. ఇటీవల, పిక్సెల్, నెస్ట్, ఫిట్ బిట్ కోసం వాయిస్ అసిస్టెన్స్ అందించే టీమ్, హార్డ్ వేర్ టీమ్ ల్లో పలువురిని ఉద్యోగాల నుంచి తొలగించింది.
2023 ద్వితీయార్థంలో తమ కంపెనీకి చెందిన అనేక బృందాలు సమర్థవంతంగా పనిచేయడానికి మార్పులు జరిగాయని, ఈరకమైన మార్పుల్లో భాగంగానే ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే తొలగించిన ఉద్యోగులు గూగుల్‌లోనే వేరేచోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది.
 మరోవంక, డిసెంబర్ త్రైమాసికంలో లాభాలు తగ్గడంతో పాటు ఉద్యోగుల సంఖ్య కూడా తగ్గినట్టు భారత రెండో అతిపెద్ద ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికానికి నికర లాభం 7 శాతం పడిపోవడంతో పాటు ఉద్యోగుల సంఖ్య 6101 పడిపోయింది. వరుసగా నాలుగో త్రైమాసికంలో ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గడం గమనార్హం.
ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీగా ఎదిగిన ఫ్లిప్‌కార్ట్‌లో 5 నుంచి 7 శాతం (1500మంది) వరకు లే ఆఫ్‌లు ఉండొచ్చునని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఫ్లిప్‌కార్ట్‌ ఏడాదిపాటు నియామకాల్ని ఆపేయనున్నదని ‘ఎకనమిక్స్‌ టైమ్స్‌’ కథనం పేర్కొన్నది.
అమెరికా, యూరోపియన్ యూనియన్ లో నెలకొన్న ఆర్థిక మందగమనం గత ఏడాది కాలంలో ప్రధాన ఐటీ, టెక్ కంపెనీల లాభాలు, ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపింది. ఓపెన్ఏఐ చాట్ జీపీటీ విజయం తర్వాత కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంపై మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు దృష్టి పెట్టాయి. అలాగే, గూగుల్ కూడా తన వర్చువల్ అసిస్టెంట్ కు జనరేటివ్ ఏఐ సామర్థ్యాలను జోడించాలని యోచిస్తోంది.